తమిళనాడులో అధికార అన్నాడిఎంకె, ప్రధాన ప్రతిపక్ష డి.ఎం.కె.పార్టీలకి ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న కెప్టెన్ విజయ్ కాంత్ నేతృత్వంలోని డి.ఎం.డి.కె.పార్టీలో ఎన్నికలకు వెళ్ళకముందే సంక్షోభం మొదలయింది. ఆ పార్టీకి చెందిన సుమారు పది మంది ప్రముఖ నేతలు తమ కెప్టెన్ పై తిరుగుబాటు చేయడంతో ఆయన వారినందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించేరు.
డి.ఎం.డి.కె. విప్ చంద్రకుమార్ నేతృత్వంలో 5మంది ఎమ్మెల్యేలు, జిల్లాలకు చెందిన కొందరు నేతలు తమ పార్టీ డి.ఎం. కె.తో పొత్తులు పెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిన్న తమ కెప్టెన్ కి బహిరంగ విజ్ఞప్తి చేసారు. అందుకు వారు ఆయనకి 24 గంటలు గడువు విధించారు. గత ఐదేళ్ళ అన్నాడిఎంకె ప్రభుత్వ పాలనలో తామంతా చాలా వేధింపులకి గురయ్యామని, కనుక ఈ ఎన్నికలలో జయలలితను తప్పనిసరిగా ఓడించాలంటే బలమయిన డి.ఎం.కె.పార్టీతో పొత్తులు పెట్టుకోవడం తప్పనిసరని తాము భావిస్తున్నట్లు చంద్రకుమార్ చెప్పారు.
క్షేత్రస్థాయిలో పనిచేసే తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా, తమ అధినేత విజయ్ కాంత్ తన ఇంట్లో భార్య ప్రేమలతతో ఇటువంటి విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వారు అన్నారు. కనుక ఇప్పటికయినా ఆయన తమ అభ్యర్ధనను మన్నించి డి.ఎం.కె. ఎన్నికల పొత్తులు పెట్టుకోవలసిందిగా విజ్ఞప్తి చేసారు. కెప్టెన్ విజయ్ కాంత్ వారు పెట్టిన గడువు కంటే చాలా ముందుగానే స్పందిస్తూ, వారినందరినీ పార్టీ నుంచి సస్పెంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
గత నెల 10వ తేదీన డి.ఎం.డి.కె.పార్టీ నిర్వహించిన ఒక బహిరంగ సభలో తమ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ కాంత్ స్వయంగా ప్రకటించేరు. తను ‘కింగ్’ కావాలనుకొంటున్నానే తప్ప ‘కింగ్ మేకర్’ కాదని ఆ సందర్భంగా ప్రకటించుకొన్నారు. ఆ మాట చెప్పిన పదిరోజుల తరువాత మార్చి 23న తన పార్టీలోని ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలకి సైతం చెప్పకుండా, ప్రజాసంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకొంటున్నట్లు విజయ్ కాంత్ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.
అంతకు ముందు ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్న పార్టీ అభ్యర్ధులకు ఆయన ఇంటర్వ్యూలు చేసినందుకే వారు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ సమయంలో కూడా ఆయన తమ పార్టీ డి.ఎం.కె.తో పొత్తులు పెట్టుకోబోతోందని ప్రతీ ఒక్కరికి హామీ ఇచ్చేరని తిరుగుబాటు చేసిన నేతలు చెప్పారు. గత ఎన్నికలలో వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకొని మరీ పోటీ చేసామని, చివరికి తమ భార్యల మెడలో మంగళ సూత్రాలను కూడా తాకట్టు పెట్టుకోవలసి వచ్చిందని, అయినా పార్టీ తరపున విజయ్ కాంత్ తమకు ఒక్క పైసా కూడా విదిలించలేదని వారు వాపోయారు. కనీసం ఈ ఎన్నికలలోనయినా తమ విజయావకాశాలు మెరుగు పరుచుకొనేందుకు బలమయిన డి.ఎం.కె.పార్టీతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, ఆ పార్టీ ‘అండదండలతో’ పోటీ చేసి గెలవచ్చని తాము ఆశిస్తే, తమ అధినేతఏ మాత్రం అంగబలం, అర్ధబలం, ప్రజాధారణ లేని ప్రజాసంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకొన్నారని వారు వాపోయారు.
సరిగ్గా ఎన్నికలకు ముందు డి.ఎం.డి.కె.పార్టీలో తలెత్తిన ఈ సంక్షోభం వలన ఆ పార్టీకి తీవ్ర నష్టం జరగవచ్చును. అదే సమయంలో ఈ పరిణామాల వలన అధికార అన్నాడిఎంకె, ప్రధాన ప్రతిపక్ష డి.ఎం.కె.పార్టీలకి ఎంతో కొంత మేలు కలుగవచ్చును.