వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్‌కు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు పెద్ద సమస్యగా మారుతున్నాయి. సీఎంవో అధికారులతో పాటు ఎంపీలు తీవ్రంగా కృషి చేస్తున్నా.. అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం దుర్లభంగా మారింది. ఈ విషయంలో సీఎం జగన్ సరైన టీమ్‌ను ఎంపిక చేసుకోలేదన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డిని ఢిల్లీ వ్యవహారాల నుంచి తప్పించడం.. బాలశౌరి లాంటి ఎంపీలకు కీలక పనులు చెబుతూండటం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని వైసీపీలోని ఓ వర్గం గుర్తు చేస్తోంది.
వైసీపీలో ఒకప్పుడు ఢిల్లీ వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డినే చూసేవారు. అందుకే.. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే ఆయనకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి కూడా ఇచ్చారు. ఈ పదవితో ఆయన నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరపడానికి అవకాశం ఉంది. అయితే వైసీపీలో మారిన పరిస్థితుల కారణంగా.. ఇటీవలి కాలంలో.. విజయసాయిరెడ్డి పాత్ర పరిమితం అయింది. ఆయనను ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలు తప్ప.. మరొక దాంట్లో కలుగచేసుకోవద్దని చెప్పేసినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు సోషల్ మీడియా టీం బాధ్యతలు చూసేవారు. ఇప్పుడు అది కూడా లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో.. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేవారు కరవైపోయారు.
విజయసాయిరెడ్డి పాత్రను పరిమితం చేసి.. బాధ్యతలు ఇచ్చిన ఇతర ఎంపీలు.. అపాయింట్మెంట్లు తీసుకు రావడంతో వైఫల్యం చెందుతున్నారు. నిజంగా ఎవరైనా.. మొత్తం అపాయింట్మెంట్లు ఖరారైన తర్వాత బయటకు చెప్పుకుంటారు. అనూహ్యంగా ఏపీ ప్రభుత్వంలో ఈ వ్యవహారాలు చూస్తున్న వారు.. అసలు అడగకుండానే మీడియాకు లీక్ ఇస్తున్నారు. చివరికి ఆ అపాయింట్మెంట్ ఖరారు కాకపోతే… సీఎం జగన్‌ను దూరం పెడుతున్నారన్న ప్రచారం జరగడానికి కారణం అవుతోంది. ఢిల్లీలో సర్కార్ వ్యవహారాల్ని చక్క బెట్టగలిగే సామర్థ్యం విజయసాయిరెడ్డికే ఉందని అంటున్నారు.
విజయసాయిరెడ్డిని అంతర్గత రాజకీయాల కారణంగా తొక్కేస్తున్నారని.. దాని వల్ల పార్టీకి.. జగన్‌కే నష్టం జరుగుతోందని అంటున్నారు. ఇప్పటికైనా అధినేత జరుగుతున్న నష్టాన్ని గుర్తించి.. విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం కల్పించాలని.. అప్పుడే ఢిల్లీలో పరిస్థితులు చక్క బడతాయని అంటున్నారు. పార్టీలోని ఓ వర్గం అభిప్రాయాలే ప్రస్తుతం సీఎం జగన్ వద్దకు వెళ్తున్నాయని..మరో వర్గం అభిప్రాయాలు కూడా చేరితేనే పార్టీలో సమస్యలు చక్కబడతాయని అంటున్నారు.