విజయసాయి రెడ్డి ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభుత్వంలో లేకపోయినా వైకాపాలో నెం.2 ఆయనే. ఆందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆనాడు వైఎస్ఆర్కు ‘ఆత్మ’ డాక్టర్ కెవిపీ రామచంద్రరావు అయితే, ఈనాడు జగన్‌కు ఆత్మ విజయసాయి రెడ్డి. జగన్‌పైన ఉన్న అవినీతి ఆరోపణల్లోనూ విజయసాయిది కీలక పాత్రే. అందులోనూ విజయసాయి కీలక భాగస్వామే. రేపు (27వ తేదీ) జరగబోయే కేబినెట్ సమావేశం చాలా కీలకమైందనే విషయం అందరికీ తెలిసిందే. రేపటి సమావేశంలోనే ఏపీ అధికారిక రాజధాని ఏదనే సంగతి బయపడుతుంది. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తును కీలక మలుపు తిప్పబోతోంది.
కేబినెట్లో అధికారిక నిర్ణయం వెలువడబోతుండగా, విజయసాయి రెడ్డి ఈరోజు ముందుగానే దాన్ని బయటపెట్టేశారు. అదేమిటో అందరూ ఊహించగలరు. అదేనండి…ఏపీ అధికారిక రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్టణమేనని. విజయసాయి ఇలా నేరుగా స్పష్టంగా చెప్పలేదు. ‘విశాఖను ఎగ్జిక్యూటవ్ కేపిటల్‌గా ప్రకటించి సీఎం జగన్ ఉత్తరాంధ్రకు మంచి బహుమానం ఇచ్చారు’..అన్నారు. సో…విజయసాయి ప్రకటనతో పరీక్షకు ముందే ఫలితం వచ్చినట్లయింది. విజయసాయి చెప్పాడంటే జగన్ చెప్పినట్లే అనుకోవాలి. అసలు జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇవ్వకముందే జగన్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రకటించారు కదా. మూడు రాజధానులు అనేది ఆయన ఒక ఆలోచనగా, ప్రతిపాదనగా చెప్పినప్పటికీ జీఎన్‌రావు కమిటీ కూడా అదే చెప్పింది.
ఈమధ్య ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా విశాఖకు రాజధాని వస్తోందని స్పష్టంగా చెప్పారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇదే విషయం కాస్త పరోక్షంగా చెప్పారు. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ సంగతి సరేసరి. ఆయన ఈ ఏడాది ఆగస్టు నుంచే రాజధాని మార్పుపై సంకేతాలిచ్చారు. ఇంతమంది ఇన్ని చెప్పాక కేబినెట్ నిర్ణయం లాంఛనమనే చెప్పుకోవాలి. 28న సీఎం జగన్ విశాఖకు వస్తున్నారని, ఆయన ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని విజయసాయి చెప్పారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో పర్యటించడం మామూలు వ్యవహారమే.
మరి ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని విజయసాయి చెబుతున్నారంటే విశాఖను రాజధానిగా ప్రకటిస్తున్నారని అర్థమే కదా. కేబినెట్ సమావేశం ముగిసిన తెల్లవారే జగన్ విశాఖకు బయలుదేరుతున్నారు. 24 కిలోమీటర్ల మేర జనం మానవహారంలా ఏర్పడి జగన్‌కు స్వాగతం చెబుతారని విజయసాయి అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. స్వాగతం చెప్పే కార్యక్రమమే మూడు గంటలపాటు కొనసాగుతుందని అన్నారు. సాధారణ పర్యటన అయితే ఇంత హడావుడి ఉండదు కదా. ఇంత సంబంరంగా ఉండదు కదా. కాబట్టి విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా అధికారికంగా ప్రకటించడానికి నిర్ణయం జరిగిపోయింది. ఈ నిర్ణయం వెలువడ్డాక టీడీపీ, ఇతర పార్టీలు, ఆందోళనకారులు కోర్టుకు వెళతారేమో.
ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి మొర పెట్టుకుంటారేమో. రాజధాని మార్పు ఉంటుందని బొత్స మొదటినుంచి సంకేతాలు ఇచ్చారంటే అప్పటినుంచే జగన్ ప్లాన్ చేస్తున్నారని భావించాలి. నిజానికి అమరావతినే రాజధానిగా ఉంచాలనుకుంటే ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేసింది జగన్, వైకాపా నాయకులే కదా. కాని ఆ విషయంలో ఇప్పటివరకు ఒక్క అడుగూ ముందుకేయలేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేసినా మాట్లాడలేదు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అవుతోంది కాబట్టి ఇక అమరావతి ప్రాధాన్యం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. అసెంబ్లీ ఉన్నంతమాత్రాన అదేమీ రాజధానిగా కీర్తి గడించదు. ఇక నుంచి అమరావతి అధికార, ప్రతిపక్షాలు కొట్టుకోవడానికి ఉపయోగపడే వేదిక మాత్రమేనని చెప్పవచ్చు.