చంద్రబాబు, లోకేష్ దేశం విడిచి వెళ్ళకుండా… కేంద్రం పాస్పోర్టు రద్దు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆయన హఠాత్తుగా మళ్లీ తెరపైకి వచ్చారు. విశాఖలో వైసీపీ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. చంద్రబాబు నాలుగేళ్లలో నాలుగున్నర లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే దేశం విడిచి వెళ్లిపోవాలని చూస్తున్నారని.. అందుకే పాస్ పోర్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డి… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లపై విమర్శలు చేయడంలో ఎలాంటి హద్దులూ పెట్టుకోవడం లేదు. అయితే వారిని విమర్శించడంలో అన్నీ పద్దతులూ అయిపోయాయేమో కానీ.. తమ మీద ఉన్న అనుమానాలనే… చంద్రబాబు, లోకేష్ పై విమర్శలుగా సంధిస్తున్నారు.
సీబీఐ కోర్టులో ఉన్న పదకొండు అత్యంత తీవ్రమైన అక్రమాస్తుల కేసుల్లో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి, ఏ టు విజయసాయిరెడ్డి. వీరిపై ఉన్న తీవ్రమైన అభియోగాల కారణంగా.. వీరు ఎక్కడికి వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సిందే. లేకపోతే కోర్టు ఆగ్రహానిి గురి కావాల్సి వస్తుంది. పాస్ పోర్టులు ఎప్పుడూ కోర్టు ఆధీనంలోనే ఉంటాయి.. ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్లాలంటే… కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. జగన్ తన కుమార్తెను లండన్ లో ఓ యూనివర్సిటీలో చేర్పించేందుకు లండన్ వెళ్లినప్పుడు.. ఆ తర్వాత విహారయాత్రలకు వెళ్లినప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. అటు జగన్ కానీ.. ఇటు విజయసాయిరెడ్డి కానీ.. విదేశాలకు వెళ్తే తిరిగి రారనే నమ్మకం ఉండటమే. చట్టం దృష్టిలో జగన్, విజయసాయిరెడ్డిలకు ఇలాంటి ఇమేజ్ ఉన్నా… దాన్ని చంద్రబాబు, లోకేష్ లపై మళ్లించేందుకు విజయసాయిరెడ్డి… ఏ మాత్రం ఆలోచించలేదు.
మొదటి నుంచి విజయసాయిరెడ్డి తీరు ఇంతే ఉంది. అ మాటకొస్తే.. వైసీపీ నేతల తీరు అంతా ఇంతే.. “ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే ” అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. గత అనుభవాలో.. గతం లో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. అంత మొత్తంలో కమిషన్లు వచ్చేవేమో కానీ.. ఓ లెక్క చూసుకుని దాని ప్రకారం ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఉంటారు. వాళ్లపై గతంలో అవే ఆరోపణలు వచ్చాయి కాబట్టి.. ప్రభుత్వంపై అవే విమర్శలు చేస్తూ ఉంటారని…”ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే ” అనే పదానికి అర్థం చెబుతున్నారని.. టీడీపీ వర్గాలు విమర్శిస్తూ ఉంటాయి.