విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్.. ప్రత్యేకంగా తమ పార్టీకి చెందిన కాపు నేతలు, కార్యకర్తలతో ఓ విందు సభను ఏర్పాటు చేశారు. కాపుల్లో తనకు బోలెడంత పట్టు ఉందని చూపించుకోవడానికో… వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో తన వర్గానికి భారీగా టిక్కెట్లు ఇప్పించుకోవాలన్న లక్ష్యమో కానీ.. వైసీపీ నెంబర్ -2 విజయసాయిరెడ్డిని ఆ కాపు భేటీకి ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు. అయితే.. అనుకున్నదొకటి.. అయిందొకటి అన్నట్లుగా పరిస్థితి మారింది. విజయసాయిరెడ్డి అలా… కాపు భేటీ ప్రాంగణంమలోకి అడుగు పెట్టారో లేదో.. ఇలా.. “జై కాపు.. జై జై కాపు” పేరుతో నినాదాలు హోరెత్తించారు. అప్పటి వరకూ కాపు కాని వాళ్లు ఇతర నేతలు వచ్చినా… ఎవరూ స్పందించలేదు. కానీ విజయసాయిరెడ్డి రాగానే ఆయనపై… కాపు నేతలు, కార్యకర్తలు చెలరేగిపోయారు.
సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే.. విజయసాయిరెడ్డిపై అంత తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. చివరికి ఆయన కూడా.. తాను కాపునని చెప్పుకోవాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లాలో రెడ్లను కాపులంటారని.. ఆ లెక్కన తాను కాపునని.. చెప్పుకుని వారిని.. కూల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ.. ఆ మాటలు.. మరింత వెటకారంగా అనిపించాయి అక్కడున్నవారికి. అందుకే చేయాల్సినంత గందరగోళం చేశారు. ఈ సమావేశాన్ని చూపి కాపు వర్గం మొత్తం వైసీపీ వైపే ఉందని చెప్పుకోవాలని ప్లాన్ చేశారు కానీ.. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే ఆందోళనకు దిగడంతో.. పరిస్థితి నెగెటివ్‌గా మారింది.
విజయసాయిరెడ్డిపై.. కాపు వర్గం నేతలు, కార్యకర్తలు అంత తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం.. పవన్ కల్యాణ్‌పై ఆయన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలేనన్న అభిప్రాయం.. ఆ సభా ప్రాంగణంలోనే వినిపించింది. పవన్ నాయుడూ అంటూ… కులాల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ.. ఆయనపై ప్యాకేజీ స్టారని.. మరొకటని.. ఇష్టం వచ్చినట్లుగా అభ్యంతరకర విమర్శలు చేస్తూంటారు విజయసాయిరెడ్డి. వాటి ప్రభావం.. ఎంత తీవ్రంగా ఉందో.. ఆయనే విశాఖలో ప్రత్యక్షంగా తెలుసుకున్నారని అంటున్నారు.