ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సాక్షిగా విజయసాయిరెడ్డి సీఐడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం పదిగంటలకు రావాల్సి ఉండగా.. మధ్యాహ్నం రెండు గంటలకు తీరిగ్గా విచారణకు వెళ్లారు. ఒకరోజు ముందే విచారణకు హాజరు అవుతానని ముందుగా ప్రకటించిన విజయసాయిరెడ్డి తర్వాత నోటీసులో పేర్కొన్నట్లే శుక్రవారం విచారణకు హాజరయ్యారు. గతంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ లిక్కర్ స్కామ్ కు కర్త, కర్మ , క్రియ రాజ్ కసిరెడ్డి అని ప్రకటించడంతో ..సిట్ అధికారులు ఆయన్ను సాక్షిగా పిలిచినట్లుగా తెలుస్తోంది.
ఈ లిక్కర్ స్కా మ్ కేసులో కీలక వ్యక్తి రాజ్ కసిరెడ్డి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఆయన ఇంట్లో, బంధవుల ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఆయన తండ్రిని కూడా విచారణకు పిలిచారు. ఆయన మాత్రం రెండు అన్సర్ లను ప్రిపేర్ అయి వచ్చినట్లు తెలియదు, గుర్తులేదు అని సమాధానాలు ఇచ్చారు. శుక్రవారం కూడా ఆయన్ను విచారిస్తున్నారు.
ఈ లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి గతంలో చెప్పడంతో.. ప్రస్తుత విచారణలో ఆయన్ను నుంచి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారోననే ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. జగన్ కోటరీని టార్గెట్ చేస్తోన్న విజయసాయిరెడ్డి..జగన్ కు వ్యతిరేకంగా ఇంతవరకు మాట్లాడలేదు.
పైగా.. తనకు జగన్ అంటే అభిమానమని చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ స్కామ్ జగన్ కు తెలియకుండా జరిగే అవకాశం లేదని టీడీపీ చెబుతోంది. ఈ స్కామ్ లో సగం వాటా జగన్ కు కూడా చేరిందని ఆరోపించారు. అయితే, విచారణలో జగన్ కు సంబంధించి విజయసాయిరెడ్డి సమాధానాలు చెప్తారా అన్నది కీలకంగా మారింది.