ఆంధ్రప్రదేశ్ తరపున ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా… మళ్లీ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ.. ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. గతంలో.. జీవో విడుదల చేయడం.. పదమూడురోజుల తర్వాత ఉపసంహరించుకోవడం చేశారు. ఇప్పుడు.. మళ్లీ నియమిస్తూ.. కొత్త జీవో విడుదల చేశారు. ఈ ఉపసంహరించుకోవడం… నియామకం మధ్యలో.. ఓ ఆర్డినెన్స్ కూడా తీసుకు వచ్చారు. అచ్చంగా.. విజయసాయిరెడ్డి కోసమే తెచ్చారు. ఆ ఆర్డినెన్స్.. ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ కోసం. లాభదాయక పదవుల జాబితా నుంచి.. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పోస్టును తప్పించి.. చట్టసవరణకు ఆర్డినెన్స్ తీసుకు వచ్చి.. గవర్నర్తో ఆఘమేఘాలపై ఆమోదింపచేసుకుని.. విజయసాయిరెడ్డిని మళ్లీ అదే పోస్టులో నియమించారు. ప్రభుత్వ ఆతృత చూసి.. రాజకీయ పార్టీలే కాదు.. సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు.
విజయసాయిరెడ్డి మాత్రమే “అలా” చేయగలరా..?
విజయసాయిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినధిగా ఉండాల్సందేనన్న ముఖ్యమంత్రి పట్టుదలకు కారణం ఏమిటో అన్నదానిపై.. సామాన్యుల్లో కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అందరికీ.. ముందుగా.. రాజకీయ కారణాలే గుర్తుకు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. విజయసాయిరెడ్డి.., ఢిల్లీలో… జగన్ తరపున అంతా తానై వ్యవహరించారు. ఎవరికైనా కొత్తగా గవర్నర్ పోస్టు వస్తుందని తెలిస్తే.. ఏ రాష్ట్రంలో ఉన్నా సరే.. వారి వద్దకు బోకే పట్టుకుని వెళ్లిపోయేవారు. ఇక ప్రధానమంత్రి మోడీని అయితే.. వారినికోసారి కలిసి.. శ్రీవారి ప్రసాదమో.. చిత్రపటమో.. ఇచ్చి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించేవారు. ఇవన్నీ వర్కవుట్ అయ్యాయని..ఆ తర్వాత పరిణామాలతో తేలిపోయింది.
యాంటీ అవుతున్న బీజేపీని కంట్రోల్ చేసుకునే ప్లానా..?
ఇప్పుడు.. బీజేపీ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో భిన్నంగా వ్యవహరిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీతో.. గతంలోలా.. ఉండాల్సిన పని లేదు.. ఆ పార్టీ సంగతి చూడాలన్న సంకల్పంతో ఉందని … ఆ పార్టీ నేతల ఘాటు ప్రకటనలతోనే స్పష్టమవుతోంది. ఈ క్రమంలో… తమకు ఉన్న మైనస్ పాయింట్లు… మళ్లీ యాక్టివ్ అయ్యి మెడకు చుట్టుకోకుండా.. ఢిల్లీలో కార్యకలాపాలను.. విజయసాయిరెడ్డి మాత్రమే చక్క బెట్టగలరని జగన్ భావించినట్లుగా… తెలుస్తోంది. పార్లమెంటరీ పార్టీ నేతగా.. ఆయనకు మామూలుగానే.. కేంద్రంలో పలుకుబడి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం తరపున వ్యవహారాలు నడిపే వ్యక్తి అంటే.. మరింత పలకుబడి ఉంటుందని.. జగన్ భావించినట్లు చెబుతున్నారు.
ఏపీ ప్రయోజనాలపై ఒక్క యాక్షన్ ప్లాన్ అయినా ఉందా..?
విజయసాయిరెడ్డికి చట్టాన్ని మార్చి మరీ పదవి అప్పగించిన జగన్మోహన్ రెడ్డి.. ఆయన వైపు నుంచి రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా ప్రయోజనాలు సాధిస్తారా… అలాంటి లక్ష్యాలు ఏమైనా పెట్టారా.. అంటే… సమాధానం దొరకని పరిస్థితి ఉంది. బడ్జెట్ పై.. విజయసాయిరెడ్డి మీడియా ముందు అసంతృప్తి చేశారు. ఏపీకి ఏమీ కేటాయించలేదన్నారు. కానీ తమ నిరసనను.. కేంద్రానికి తెలియచెప్పే ప్రయత్నం చేయలేదు. చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా.. ఏపీకి రావాల్సిన విభజన హామీలు.. ఇతర అంశాల్లో ఎలాంటి పోరాట ప్రణాళికలు కూడా పెట్టుకోలేదని.. తెలిసిపోతోంది. విజయసాయిరెడ్డికి పదవి లక్ష్యం ఒక్కటే..! అదేంటో.. అందరికీ తెలిసిందే..!