ట్యాపింగ్, హ్యాకింగ్ ఎలా చేస్తారో మొత్తం తనకు తెలుసని విజయసాయిరెడ్డి పార్లమెంట్ లో చెప్పారు. ఫోన్ కెమెరాను ఉపయోగించి కూడా హ్యాకింగ్ చేయవచ్చని… తనకు ఈ విషయంలో మొత్తం తెలుసుని ఆయన నేరుగా రాజ్యసభలో చెప్పారు. రాజ్యసభలో డెటా ప్రొటెక్షన్ బిల్లుపై చర్చలో విజయసాయిరెడ్డి చేసిన ప్రసంగంలో… ఆయన చెప్పిన విషయాలు సంచలనంగా మారుతున్నాయి. ఈ ట్యాపింగ్, హ్యాకింగ్ చేసే సంస్థలు తనకు ప్రజెంటేషన్ ఇచ్చాయని అలా తెలిసిందని అంటున్నారు. కానీ ఆ సంస్థలు ఎవరికి పడితే వారికి ఇవ్వవు. ఖచ్చితంగా ప్రభుత్వ ప్రతినిధి అయిన వారికే ఇస్తారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన వాటిని పరిశీలించి … ఒప్పందం చేసుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఏపీలో ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా చేయని అక్రమం , అరాచకం లేదు. ఇందు కోసం చాలా ఖర్చు పెట్టి ట్యాపింగ్, హ్యాకింగ్ చేసే సేవలను ఇతర దేశాల నుంచి పొందుతోంది. వారికి నగదు చెల్లింపులు చేస్తున్నారని పయ్యావులకేశవ్ గతంలో ఆరోపించారు. అంతే కాదు.. పెగాసస్ కూడా ఏపీ ప్రభుత్వం వాడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతలపైనే కాదు.. స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనా నిఘా పెట్టినట్లుగా బయటపడింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఆధారాలను బయట పెట్టారు.
ప్రభుత్వం మారిన మొదట్లో అందరిపై నిఘా పెట్టి వ్యక్తిగత రహస్యాల సేకరణ మిషన్ ను విజయసాయిరెడ్డే నిర్వహించారని ఆయన మాటలను బట్టి అర్థమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. నేరుగా పార్లమెంట్ లోనే ఆయన ఈ విషయాన్ని చెప్పారు కాబట్టి వెనక్కి తీసుకోలేరు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి డేటా ప్రొటెక్షన్ పై చిత్తశుద్ధి ఉంటే తక్షణం విజయసాయిరెడ్డి నుంచి వివరాలు తీసుకుని ఏపీలో ప్రభుత్వం .. పౌరులపై.. ప్రజలపై పెట్టిన నిఘా గురించి బయటకు లాగాలి.. కుట్రలన్నింటినీ బయట పెట్టాలి. లేకపోతే.. ప్రజలకు ప్రభుత్వాల నుంచి రక్షణ లేకుండా పోయినట్లే.