” ఇది నా ఇలాఖా.. ముఖ్యమంత్రి ఫోటో కంటే నా ఫోటో పెద్దదిగా ఫ్లెక్సీల్లో ఉండాలి. ఎన్ని లక్షల పోస్టర్లు ప్రింట్ చేసినా మార్పించు..” అని ఓ ప్రచార చిత్రం ప్రింట్ చేయించుకు వచ్చిన పార్టీ లీడర్‌కు ముఖ్యమంత్రి సోదరుడు అయిన నేత ఆర్డర్ వేస్తారు. ఆయన ఆ రాష్ట్రంలో ఓ ప్రాంతానికి ఇంచార్జిగా ఉంటారు. ఆయన ఆదేశించినట్లే తర్వాత ఆయన ఫోటోనే ప్రముఖంగా చూపిస్తూ పోస్టర్లు రీప్రింట్ చేసి ఊరంతా వేయిస్తారు..!. ఇది మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో ఓ సీన్. ఏపీలో నిజంగానే జరుగుతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం విశాఖ వైపు చూస్తే.. అదే నిజం అని అనుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పుడక్కడ.. విజయసాయిరెడ్డి ఫ్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాటిలో జగన్ బొమ్మ వెదుక్కుంటే తప్ప కనిపించడం లేదు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకు వైసీపీ శ్రేణులకు అంత ఉత్సాహం కలిగిందో లేదో కానీ..ఇప్పుడు విశాఖలో మాత్రం విజయసాయి పుట్టినరోజుకు ఆ పార్టీ నేతలు గంగవెర్రెత్తిపోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాది జగన్ పుట్టిన రోజును కూడా.. విశాఖలో మామూలుగానే జరిపారు. అక్కడక్కడా మాత్రమే ఫ్లెక్సీలు కనిపించాయి. కానీ ఇప్పుడు.. విశాఖను చూస్తే.. ముఖ్యమంత్రిని మించి విజయసాయిరెడ్డికి విశాఖలో ఫాలోయింగ్ ఉందని అర్థమైపోతుంది. జూలై ఒకటో తేదీన అంటే గురువారం రోజున … బర్త్ డే జరుపుకుంటున్న విజయసాయిరెడ్డికి… విశాఖ మొత్తం శుభాకాంక్షలు చెబుతోంది. అక్కడి సామాన్యుల సంగతేమో కానీ.. ఆయన పార్టీ నేతలు .. ఆయన ప్రాపకం కోసం తహతహలాడే వారు మాత్రం.. విశాఖను ఫ్లెక్సీలతో ముంచెత్తారు. ఏ మూలకెళ్లినా… విజయసాయిరెడ్డికి బర్త్ డే విషెస్‌తో వైసీపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. అందులో ఎక్కడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కనిపించడం లేదు. ప్రోటోకాల్ పాటిద్దామని ఎవరైనా లీడర్ ఫ్లెక్సీ మీద జగన్ బొమ్మ వేసినా అది ఎక్కడో అట్టడుగున ఉంటోంది.
వాస్తవానికి విశాఖలో ఫ్లెక్సీలను నిషేధించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. కానీ ప్రస్తుతం వైసీపీ రాజ్యంలో… అధికార పార్టీ నేతలకు.. చట్టాలు వర్తించవు కాబట్టి… వాటిని ఎవరూ పట్టించుకోలేదు. విశాఖ ప్రజలకు ఈ విషయం చాలా కాలంగా అనుభవమవుతూనే ఉంది కాబట్టి… మనసులో పెట్టుకుంటున్నారు కానీ బయట పడటం లేదు. అయితే.. విజయసాయిరెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉండే వైసీపీ నేతలు మాత్రం… ఆయన తీరు తేడాగా ఉందని.. మొత్తం రిపోర్ట్‌ను.. హైకమాండ్‌కు పంపుతున్నారట. జగన్ కన్నా.. ఉత్తరాంధ్రలో తనకే ఫాలోయింగ్ ఎక్కువ ఉందని.. చెప్పుకుంటున్నారని నివేదికలు వెళ్తున్నాయి. ఇలా జరుగుతుందని విజయసాయికి తెలుసు.. ఆయినా ఆయన రాజకీయం చేసుకుంటారు మరి..!