విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఎప్పటిలాగానే విపక్ష నేతల మీద విరుచుకు పడుతున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 1000 దాటడం, కర్నూలు కరోనా రాజధానిగా మారిందా అని అనుమానించే అంతగా అక్కడ కేసులు పెరగడం జరుగుతున్న నేపథ్యంలో, కరోనా వ్యాప్తి నిరోధం పై కంటే రాజకీయాలపై విజయసాయి ఎక్కువగా దృష్టి పెట్టడం మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే..
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ, “బాబు పబ్లిసిటీ స్టంట్ల కైపులో మునిగి తేలిన టీడీపీ నేతలు, జగన్ గారు ఎటూ వెళ్లరా అని శోకాలు పెడుతున్నారు. అతనికి టాబ్లెట్ వేయండి, ఇతనికి టెంపరేచర్ చూడండి అని బాబులా డ్రామాలాడాలట! ప్రభుత్వ యంత్రాంగం స్వేచ్ఛగా పనిచేస్తోంది. సిఎం గారు పర్యవేక్షిస్తున్నారు. కనిపించడం లేదా?. మీడియాలో కనిపించడం ఆత్మ సంతృప్తినిస్తుందేమో కానీ జనాల్లో సానుభూతి, అభిమానం పెరగడానికి మాత్రం పనికి రాదు. 80 శాతం అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు గెల్చుకున్న అధికార పక్షం ప్రజల మధ్యన ఉంటూ, ఏడాది తిరగక ముందే హామీలన్నీ నెరవేరుస్తుంటే ఎల్లో మీడియాను పట్టుకుని ఊగులాడితే ఏమొస్తుంది?” అని రాసుకొచ్చారు.
అయితే పార్టీలతో నిమిత్తం లేకుండా విజయ సాయి రెడ్డి ట్వీట్ ల పై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. వైఎస్ఆర్సిపి ని అభిమానించే నెటిజన్లు సైతం రాజకీయాల మీద కాకుండా వ్యాప్తిని నిరోధించడం పై ఎక్కువ ఫోకస్ చేయాలంటూ విజయసాయిరెడ్డికి సూచనలు ఇస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం, అధికారంలో లేకపోయినా బాబు మీడియాతో మాట్లాడుతున్నాడు అంటూ విమర్శిస్తున్న విజయసాయిరెడ్డి, అధికారంలో ఉండి కూడా జగన్ లైవ్ లో మీడియాతో మాట్లాడ లేకపోతున్నాడెందుకు అంటూ చురకలు వేశారు. ఆ మధ్యన లైవ్ ప్రెస్మీట్లో జగన్ మాట్లాడుతున్నప్పుడు వరుసగా తప్పులు దొర్లడం, అవి సోషల్ మీడియాలో ట్రోల్ కావడం, ఆ తర్వాత కారణం అదో కాదో కానీ, జగన్ మాత్రం మీడియాతో లైవ్ చాటింగ్ కాకుండా, రికార్డెడ్ వీడియోలు పంపడం తెలిసిన సంగతే. మరి కొందరు నెటిజన్లు అయితే, ఎంపీ విజయసాయిరెడ్డి అనేక జిల్లాలు తిరుగుతున్నాడని, వైఎస్ఆర్ సీపీ నేతలు కొందరు ర్యాలీలు చేస్తున్నారని, లాక్ డౌన్లోడ్ సమయంలో వీరు ప్రవర్తిస్తున్న తీరు సరికాదని విమర్శిస్తున్నారు.
ఏది ఏమైనా, విపక్ష నేతల మీద తీవ్రపదజాలంతో విజయసాయిరెడ్డి విరుచుకుపడడం, దానికి నెటిజన్ల నుండి ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో రావడం ఇటీవల పరిపాటిగా మారింది.