గురివింద గింజ తన నలుపు తాను ఎరుగదని సామెత. మాజీ మంత్రి లోకేష్ పై విజయసాయి రెడ్డి తాజా గా చేసిన వ్యాఖ్యలు ఈ సామెత ని గుర్తు చేస్తున్నాయి అని అంటున్నారు నెటిజన్లు. లోకేష్ దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయ్యాడంటూ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ అయినట్లు గా కనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ, “చరిత్ర సృష్టించేందుకే మంగళగిరిలో పోటీ చేశాడట చిట్టి నాయుడు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకనే కదా దొడ్డి దారిన ఎమ్మెల్సీ, మంత్రి అయింది. ఈ చరిత్ర సృష్టించాలన్న తాపత్రం ఏమిటో? రెండొందల కోట్లు వెదజల్లినా మంగళగిరిలో చిత్తుగా పరాజయం పాలయ్యావు. ఇకనైనా బడాయి మాటలు మానుకో చిట్టీ” అని రాసుకొచ్చారు.
అయితే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు గురివింద గింజ సామెత ని గుర్తు చేస్తున్నాయి అంటూ విరుచుకుపడ్డారు నెటిజన్లు. మీరు కూడా ఇలాగే దొడ్డిదారిన రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు అంటూ దెప్పిపొడిచారు జనాలు. మరికొందరైతే, మీరేమన్నా ఎన్నికల్లో నిలబడి ప్రజల ఓట్లతో పార్లమెంటులో అడుగు పెట్టారా అని ప్రశ్నించారు. లోకేష్ కనీసం ఎన్నికల్లో పోటీ అయినా చేశాడని, నువ్వు జీవితంలో ఎప్పుడైనా పోటీ చేసావా అంటూ మరికొందరు విజయసాయి పై విరుచుకుపడ్డారు.
ఏది ఏమైనా ఇటువంటి బ్యాక్ ఫైర్ అయ్యే కామెంట్లు చేయడం లో తనకు తానే సాటి అని రోజురోజుకీ నిరూపించుకుంటున్నారు విజయసాయిరెడ్డి.