ఇక రాజమండ్రి కన్ను పడిందా? అంటూ విజయసాయిరెడ్డిపై నెటిజన్లు ఒక్క సారిగా విరుచుకుపడ్డారు. దీనికి కారణం ఏమిటంటే.. రాజమహేంద్రవరంలో చల్లని స్వచ్చమైన గాలులు వస్తున్నాయని.. అలాంటి స్వచ్చమైన గాలులు వస్తోంది ఇండియాలో ఒక్క రాజమండ్రేనని.. ఆయన చెబుతూ ట్వీట్ చేశారు. వరల్డ్ ఎయిర్ ఇండెక్స్‌లో ఈ విషయం నమోదయిందన్నారు. విజయసాయిరెడ్డి రాజమండ్రి గురించి ప్రత్యేకంగా చెప్పడంతో కొంత మంది ఉలిక్కి పడ్డారు. ఇక ఆయన కన్ను రాజమండ్రి మీద పడిందా అంటూ.. విమర్శలు ప్రారంభించారు. విజయసాయిరెడ్డికి ఉన్న ఇమేజ్‌కు ఆ స్పందన సాక్ష్యం అనుకోవచ్చు.
విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా వరల్డ్ ఎయిర్ ఇండెక్స్ ప్రకారం దేశంలో రాజమహేంద్రవరానికే స్వచ్చమైన గాలులు ఉన్నాయి. అయితే ఇవి ఇయర్లీ ప్రకటించే నివేదికలు కావు. వరల్డ్ ఎయిర్ ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు వాతావరణ కాలుష్యాన్ని కొలుస్తూ వెబ్ సైట్లో అప్ డేట్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా దీపావళి రోజుల్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. టపాసులు కాల్చడం వల్ల గాలి అంతా ధూళి మయం అవుతుంది. ఈ కారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దేశంలో ప్రముఖ పట్టణాల్లో గాలిలో ఉన్న కాలుష్యం గురించి నివేదిక విడుదల చేసింది. ఇతర దేశాలతో కలపడం వల్ల… మిగతా అన్ని పట్టణాల్లోనూ దీపావళి కాలుష్యం కారణంగా వెనుకబడిపోయారు. ఏపీ ప్రజలకు దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితుల కారణంగా టపాసులు భారీగా కొని కాల్చలేకపోయారు. ఫలితంగా పొల్యూషన్ తగ్గింది.
అయితే సందు దొరికింది కదా అని రాజమండ్రి గురించి విజయసాయిరెడ్డి ప్రకటన చేయడంతో అందరికీ అనుమానం బలపడింది. ఇప్పటికే విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అరబిందో కాకినాడలో పోర్టులతో పాటు ఫార్మా సెజ్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. జీఎంఆర్ నుంచి ఆ ప్రాజెక్టును కొనుక్కుంది. ఇలాంటి లావాదేవీలు ఏమైనా రాజమండ్రికి విస్తరిస్తున్నారేమో కానీ ఆయన అడుగు పెడితే చాలు అందరూ వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది.