సాయన్న ముసలోడైపోయాడు. అన్ని పనులు చేసుకోలేడు అని.. పార్టీలో ఒక్క అనుబంధ సంఘాల ఇంచార్జ్ పదవిని కూడా పీకేసి రిటైర్మెంట్ ప్రకటించిన జగన్ రెడ్డికి ఇప్పుడు మళ్లీ ఆయనకు వయసొచ్చిందని గుర్తించారు. వెంటనే ఆయనను పిలిచి.. కోస్తాలోని నాలుగు కీలక జిల్లాలకు ఇంచార్జ్ గా పెట్టేశారు. రెండు ఉమ్మడి జిల్లాలు, రెండు విభజన జిల్లాలను కలిపి ఈ బాధ్యతలిచ్చారు. జగన్ రెడ్డి చల్లని చూపు ఉంటే తనకు వయసు ఉన్నట్లేనని ఫీలయ్యే విజయసాయిరెడ్డి వెంటనే బాద్యతల్లోకి వచ్చేశారు.
గత ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి టాస్క్ మాస్టర్ గా పని చేశారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఐ ప్యాక్ ను సమన్వయం చేసుకోవడం దగ్గర్నుంచి అందరికీ డబ్బులు చేర్చడం… హైదరాబాద్ పోలీసుల్ని వాడుకుని టీడీపీపై కేసులు పెట్టించడం సహా.. చాలా చేశారు. ఓ రకంగా ఆయన దళపతిగా పని చేశారు. కానీ గెలిచిన తర్వాత సర్వం సజ్జల అయ్యారు . తనకు ఉత్తారంధ్ర చాలని విజయసాయిరెడ్డి అటు వైపు వెళ్తే తాడేపల్లిలో ఫిక్స్ అయిన సజ్జల… విజయసాయిరెడ్డికి టెండర్ పెట్టేశారు. దాంతో ఆయన దూరం కావాల్సి వచ్చింది.
విజయసాయిరెడ్డి చేసే పనులన్నింటికీ సజ్జల ప్రత్యామ్నాయ వ్యక్తుల్ని తెచ్చి పెట్టారు. అందుకే సాయన్న ముసోలడైపోయాడని జగన్ రెడ్డి తేల్చారు . కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున మళ్లీ సాయన్న అవసరం లేకపోతే గట్టెక్కలేమని అనుకుంటున్నారేమో కానీ తీసుకొచ్చి కోస్తా జిల్లాల బాధ్యతలిచ్చారు. అదే పరమాన్నం అనుకుంటూ సాయిరెడ్డి కూడా రంగంలోకి దిగిపోయారు.