విజయసాయిరెడ్డి నేను కేంద్ర మంత్రిని అయితే .. అంటూ ట్వీట్లు పెడుతున్నారు. కేంద్రమంత్రిని అయితే ఏంచేస్తానో చెబుతున్నారు. కానీ అసలు కేంద్రమంత్రిగా ఎలా అవుతారు అన్న లాజిక్ ..తన పార్టీతో పాటు ఇతరులకు ఇస్తుందన్న సంగతిని మర్చిపోయారు. అసలు ఆయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చేందుకు ఒకే ఒక్క దారి ఉంది. అది ఆయన బీజేపీలోకి ఫిరాయించడం. ఆయన బీజేపీలోకి వెళ్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది.అందుకే ఆయనను చేర్చుకుంటారని అనుకున్నారు. కానీ అది జరగలేదు.
మరి ఇప్పుడు ఆయన తాను కేంద్రమంత్రిగా అయితే అంటూ రాగాలు తీస్తున్నారు. దీనర్థం ఆయన బీజేపీతో మాట్లాడేసుకున్నారని తనతో పాటు వైసీపీలో ఉన్న ఇద్దరు, ముగ్గురు ఎంపీలను కూడా పట్టుకుని పోయి కేంద్ర మంత్రి పదవిని కొట్టేద్దామనుకుంటున్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఈ వ్యూహం వెనుక జగన్ ఉన్నారని కూడాకొంత మంది నమ్ముతున్నారు. అయితే విజయసాయిరెడ్డిని చేర్చుకుంటారా… చేర్చుకుని కేంద్ర మంత్రిని చేస్తారా అన్నదానిపై మాత్రం.. బీజేపీ వర్గాలు కనీసం లీకులు కూడా ఇవ్వడం లేదు.
విజయసాయిరెడ్డిని జగన్ రెడ్డిదాదాపుగా పక్కన పెట్టేశారు. సాయన్న ముసలాడైపోయాడు.. ఆయన బాధ్యతల్ని చెవిరెడ్డికి ఇస్తున్నానని సీఎంగా ఉన్నప్పుడు ఓ సమావేశంలో చెప్పేశారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ సాయన్ననే తీసుకు వచ్చి విశాఖకు ఇంచార్జును చేశారు. మళ్లీ జగన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తూండే సరికి ఆయనలో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. చివరికి జగన్ రెడ్డిని డంపింగ్ చేసి తన దారి తాను చూసుకుని కేంద్రమంత్రి అయిపోవాలని కలలు కంటున్నట్లుగా తాజా పరిస్థితి కనిపిస్తోంది.