సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణకు.. చంద్రబాబు బాస్ అంటూ.. ఆరోపణలు చేస్తూ… అదే పనిగా.. ట్వీట్లు పెడుతున్న విజయసాయిరెడ్డి గురించి… ఓ సంచలన నిజం బయటకు వచ్చింది. దాన్ని వీవీ లక్ష్మినారాయణే బయటపెట్టారు. అయితే.. అది అక్రమాస్తుల కేసు గురించి కాదు. అది కోర్టు విచారణలో ఉన్నందున వాటి గురించి తానేమీ మాట్లాడబోనని గతంలోనే… వీవీ లక్ష్మినారాయణ ప్రకటించారు. రాజకీయం గురించే. వీవీ లక్ష్మినారాయణ స్వచ్చంద పదవీ విరమణ తర్వాత… ఆయనకు మొట్టమొదటిగా.. రాజకీయ ఆఫర్ ఇచ్చింది వైసీపీనే. అదీ కూడా విజసాయిరెడ్డే. తమ పార్టీలోకి వస్తే… ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తామన్నారట. ఈ విషయాన్ని ట్విట్టర్లోనే వీవీ లక్ష్మినారాయణ ప్రకటించి.. తనపై.. చేస్తున్న ఆరోపణలపై ఆశ్చర్యం ప్రకటించారు.
వీవీ లక్ష్మినారాయణ … ఏపీలో సీబీఐకి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చారు. తను దర్యాప్తు చేసిన సత్యం రామలింగరాజు, గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ కేసుల్లో… ప్రతి చిన్న విషయాన్ని బయటకు తీశారు. ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచారు. నిజానికి ఆయన ఏ మాత్రం పట్టు సడలించినా ఆయా కేసులు నీరుగారి పోయేవే. నేరుగా… న్యాయమూర్తికే లంచం ఇవ్వబోయిన గాలి జనార్ధన్ రెడ్డి… అప్పట్లో వీవీ లక్ష్మినారాయణను ప్రలోభ పెట్టకుండా ఉంటారని అనుకోలేం. అయినప్పటికీ… ఆయన నిజాయితీగా.. విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో.. జగన్మోహన్ రెడ్డి సాగించిన క్విడ్ ప్రో కో వ్యవహారాలన్నీ సాక్ష్యాలతో సహా బయటకు వచ్చాయి. సీబీఐలో లక్ష్మినారాయణ డిప్యూటేషన్ ముగిసిన తర్వాత వాటిపై విచారణ నెమ్మదించింది. అయితే.. అలాంటి లక్ష్మినారాయణను.. ఆయన వల్లే.. తాము జైలుకు వెళ్లాల్సి వచ్చిందని… పదే పదే ఆరోపిస్తూ.. చంద్రబాబు చెప్పినట్లు చేస్తారని… నిందించే… వ్యక్తిని కూడా తమ పార్టీలోకి ఆహ్వానించారు విజయ సాయి రెడ్డి. మామూలుగా అయితే…అలాంటి ఆలోచన కూడా రానివ్వరు. కానీ.. నేరుగా పార్టీలోకి ఆహ్వానించారు విజయసాయిరెడ్డి.
వీవీ లక్ష్మినారాయణను.. విజయసాయిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించడం … అంటే… ఆయనకు ఓ రకంగా.. ఎవరితోనూ సంబంధాలు లేవని నమ్మడమే. నిజంగా… వీవీ లక్ష్మినారాయణ.. చంద్రబాబు చెప్పినట్లో.. మరొకరు చెప్పినట్లో.. కేసుల దర్యాప్తు చేశారని… వైసీపీ నేతలు నమ్ముతూ ఉంటే.. ఆయనను ఎందుకు పార్టీలోకి ఆహ్వానిస్తారు..?. వీవీ లక్ష్మినారాయణ తమ పార్టీలోకి వస్తే.. జాక్ పాట్ కొట్టవచ్చని… వైసీపీ నేతలు ఆశ పడ్డారు. తమపై జరిగిన దర్యాప్తులు అన్నీ బూటకమేనని అలా నిరూపించగలిగితే.. తాము బయటపడినట్లేనని అనుకున్నారు. కానీ.. కుదరకపోయే సరికి… వీవీ లక్ష్మినారాయణపైనే బురదచల్లుతున్నారు. చంద్రబాబుతో లింకులు పెట్టి ఆరోపిస్తున్నారు. విజయసాయి చేస్తున్న ఆరోపణలు నిజం అయితే… పార్టీలోకి లక్ష్మినారాయణను ఎందుకు విజయసాయిరెడ్డి ఆహ్వానించారు..?