ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఉచ్చు బిగుస్తుందని భయపడుతున్నారో ఏమో కానీ తరుచుగా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. లిక్కర్ కేసులో తనకు రూపాయి కూడా ముట్టలేదని , అసలు దొంగల బాగోతం త్వరలోనే బయటపెడుతానని ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది.
లిక్కర్ స్కామ్ దొంగలు బట్టలు సగమే విప్పారని..మిగతా వారి బట్టలు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తానంటూ బాంబ్ పేల్చారు. దాంతో అసలు దొంగలు ఎవరు? ఇప్పటివరకు ఈ స్కామ్ కు సూత్రధారిగా రాజ్ కసిరెడ్డియే అని పేర్కొన్న విజయసాయిరెడ్డి..ఈ కేసులో దొరకని దొంగలు తన పేరు లాగుతున్నారని వ్యాఖ్యానించడంతో ఆ అసలు దొంగలు ఎవరనే చర్చ జరుగుతోంది.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే ఆయన మరోసారి సిట్ విచారణకు పిలుస్తే వెళ్లాలని ఆశపడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇదివరకు జరిగిన విచారణలో ఈ లిక్కర్ స్కామ్ బిగ్ బాస్ ఎవరు అని విచారణ అధికారులు ప్రశ్నిస్తే తెలియదు అని సమాధానం ఇచ్చినట్లు ఆయనే చెప్పారు. ఇంతలోనే రాజ్ కసిరెడ్డి అరెస్ట్ జరగడం..మళ్లీ ఇప్పుడు కొత్తగా అసలు దొంగల చిట్టా విప్పుతానని పేర్కొనడటం గమనార్హం.
అయితే, విజయసాయి రెడ్డి విచారణ తర్వాత సిట్ విచారణకు హాజరైన మిథున్ రెడ్డి ఈ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆయన జగన్ కు అత్యంత సన్నిహిత నేత. ఒకవేళ మిథున్ రెడ్డి కూడా ఈ స్కామ్ లో కీలకమని విజయసాయిరెడ్డి చెప్తే.. అది జగన్ ను పుట్టి ముంచినట్లే అవుతుంది. కానీ, విజయసాయిరెడ్డి అలా చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు.
కానీ, ఆయన వ్యాఖ్యలు మాత్రం వైసీపీలో కాక పుట్టిస్తున్నాయి.విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యాఖ్యలు చేస్తున్నారా? మరేదైనా రాజకీయ ఉద్దేశంతోనే చేస్తున్నారా? అని టెన్షన్ ఫీల్ అవుతున్నారు.