వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర మొత్తానికి తానే ముఖ్యమంత్రినన్నట్లుగా చెలరేగిపోతున్నారు. అధికారిక నిర్ణయాలను ఏమేం చేయబోతున్నామో.. ఎలా చేస్తున్నామో కూడా ప్రకటిస్తున్నారు. విశాఖ- విజయనగరం జిల్లాలను జంట నగరాలుగా అభివృద్ది చేస్తున్నామని ప్రకటించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టేసి విశాక ఎయిర్ పోర్టును రక్షణశాఖ ఇచ్చేస్తామని తేల్చేశారు. విశాఖ నుంచి భోగాపురంకు ఆరు లైన్ల రహదారి నిర్మిస్తున్నామని గొప్పగా ప్రకటించారు . సీ పోర్టు నుంచి భీమిలికి కూడా రోడ్డేస్తున్నామన్నారు. వీలైనంత తక్కువగా ప్రైవేటు భూముల సేకరణ ఉంటుందని కూడా చెప్పారు. అలాగే ఇంటర్నల్ రోడ్లలో విశాఖ 70 మీటర్లు, నగరం దాటిన తర్వాత 70కి పైగా వెడల్పు ఉంటుందని కూడా ప్లాన్ వేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఇన్ని పనులు చేస్తున్మామని ఎప్పుడూ చెప్పలేదు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కన్నా ఎక్కువగా విశాఖలో హడావుడి చేస్తున్నారు. ఆయన తీరు చూసి ఇతర వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. అసలు ఆయన ఏ హోదాలో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.ఆయన రాజ్యసభ ఎంపీ మాత్రమే. ఆయన రాజ్యసభ పదవికి విశాఖకు సంబంధం లేదు. ఆయన వైసీపీ ఇంచార్జ్ మాత్రమే. ఆయన పార్టీ వ్యవహారాలను చూసుకోవడానికే ఆ పదవి. కానీ ఆయన పరిపాలన మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారు. పైగా తెర వెనుక ఉండకుండా తెర ముందుకు వచ్చి రచ్చ చేస్తున్నారు.
సింహాచలం ఆలయానికి వెళ్లి పూర్ణకుంభం స్వాగతం పొందారు. అలా గౌరవమర్యాదలు పొందేంత హోదా తనకు అధికారికంగా లేదని అలా చేయడం దేవుడ్ని అవమానిచడమేనని ఆయన అనుకోలేదు. నిర్మోహమాటంగా మర్యాదలు పొందారు. మరో వైపు ఉత్తరాంధ్ర వైసీపీలో దిగ్గజాలనదగ్గ నేతలు ఉన్నారు. బొత్స లాంటి వారితో వివాదాస్పద ప్రకటనలు చేయించి.. ప్రజల్లో ఆయన పలుకుబడిని తగ్గిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావునుపూర్తిగా పక్కన పెట్టేశారు. ఇతర నేతలెవరూ నోరెత్తే పరిస్థితి లేదు. దీంతో విజసాయిరెడ్డితే ఇష్టారాజ్యం అయిపోయింది. అందుకే ఆయన ముఖ్యమంత్రి చేయాల్సిన ప్రకటనలను కూడా ఉత్తరాంధ్ర తరపున చేసేస్తున్నారు.