విజయసాయిరెడ్డి బీజేపీని ఇన్స్పైర్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల పై తెలంగాణ ప్రభుత్వ ప్రభావం ఎంత ఉంటుందనేది విజయసాయిరెడ్డికి బాగా తెలుసు. గత ఎన్నికలకు ముుందు ఆయన ఆ అడ్వాంటేజ్ ను వాడుకున్నారు. కానీ ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన రెచ్చగొడుతున్నారు. తమకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించేలా చేస్తున్నారు. ఇది వైసీపీ నేతల్ని మరింతగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఏపీలో రాజకీయాలు చేసే వారిలో 90 శాతం మంది ఆర్థిక మూలాలు హైదరాబాద్ తో ముడిపడి ఉంటాయి. వ్యాపారాలు ఉన్న లీడర్లను ఎలా నొక్కారో గతంలో కేసీఆర్ శాంపిల్ చూపించారు. జగన్ రెడ్డి ట్రైలర్ చూపించారు. చూపించాలనుకుంటే రేవంత్ రెడ్డి సినిమా చూపించగలరు. ఇలాంటి పవర్ చేతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఎందుకు విజయసాయిరెడ్డి చెలగాటం ఆడుతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఆయన అలా మాట్లాడిన కాసేపటికే వర్రా రవీంద్రారెడ్డిపై సోషల్ మీడియా కేసు నమోదయింది. ఇప్పుడు వైసీపీ నేతల వ్యాపారాల్లో అక్రమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
విజయసాయిరెడ్డి ఉద్దేశపూర్వకంగా జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికే రేవంత్ రెడ్డితో మరింతగా ఘర్షణ పూరిత వైఖరిని తెరపైకి తెస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. షర్మిల తెలంగాణ కాంగ్రెస్ లో చేరడం ఆయనకు ఇష్టం లేదు.. ఎన్నికలకు ముందు అదే చెప్పారు. చివరికి షర్మిల ఏపీ కాంగ్రెస్ కు వెళ్లిపోయారు. పార్టీ పరంగా రేవంత్ ఆమెకు మద్దతు పలికినట్లుగా కూడా ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ బయటకు రాక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నారు విజయసాయిరెడ్డి.