వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ … ప్రభుత్వంలోనూ అదే పొజిషన్లో కొనసాగుతున్న విజయసాయిరెడ్డి వ్యవహారం ఇటీవలి కాలంలో మరింత సూటిగా మారుతోంది. అన్నింటా తానే కనిపిస్తున్నారు. అన్ని స్టేట్మెంట్లు తానే ఇస్తున్నారు. విశాఖ రాజధాని తీరుతుందని చాలెంజ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి లేని పోని గొప్పలను ట్వీట్లలో ఆపాదించే బాధ్యతను తానే తీసుకున్నారు. అదే సమయంలో.. రాజకీయంగా బీజేపీతోనూ సున్నం పెట్టుకునే కార్యక్రమం చేశారు. ఈ క్రమంలో… సుజనా చౌదరి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను సుజనా చౌదరి కంపెనీలకు ఆడిటర్‌గా పని చేశానని.. ఆయన దొంగ కంపెనీలు పెట్టి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారని చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి తెలిసిందేమిటంటే.. ఆ స్కాం మొత్తం ఆడిటర్ విజయసాయిరెడ్డి కనుసన్నల్లో జరిగింది. ఇప్పుడు రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి దాన్ని బయటపెడతానని బెదిరించారు. అంత వరకూ బాగానే ఉంది. దీన్ని విస్తృతార్థంలో తీసుకుంటే… కొంపలు మునిగిపోతాయని.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే వేమూరి రాధాకృష్ణ తన వారంతపు ఆర్టికల్ కొత్తపలుకులో తేల్చేశారు.
ఇప్పుడు సుజనా చౌదరిని బెదిరించిన విజయసాయిరెడ్డి.. తర్వాత జగన్మోహన్ రెడ్డిని బెదిరించరని నమ్మకం ఏమిటని.. ఆర్కే అనుమానం. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియని వ్యాపార లావాదేవీలు విజయసాయిరెడ్డి నిర్వహించారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసులో గుట్టు విప్పితే.. మొత్తం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటందని .. నిపుణలు ఎప్పటి నుండో విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో సుజనాచౌదరికి ఇచ్చిన వార్నింగ్‌ను అదే కోణంలో చూడాలని ఆర్కే అంటున్నారు. నిజానికి విజయసాయిరెడ్డికి అలాంటి ఆలోచన ఉందో లేదో కానీ.. ఆర్కే మాత్రం పుట్టించి ఉంటారు. పుట్టించకపోయినా.. ఈ అనుమానాన్ని జగన్మ మనసులోకి పెట్టే ప్రయత్నం చేశారు. అదే రాజకీయం అనుకోవాలేమో..?
తన ఆర్టికల్‌లో… న్యాయవ్యవస్థ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిని ఆర్కే మరింత బూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారు. రంగుల విషయంలో ఏపీ సర్కార్ తీరు… న్యాయస్థానాన్ని అవమానపరిచేలా ఉందని.. గుర్తు చేశారు. గతంలో ఒక సారి… న్యాయస్థానాలు నిర్ణయాలను తప్పి పట్టినందుకు.. రాజీనామాలు చేశారని..ఇప్పుడు యాభై సార్లు మొట్టికాయలు వేసినా.. కోర్టును అగౌరవపరుస్తున్నారు కానీ.. రాజీనామాలు చేయడం లేదని ఆర్కే ఆక్షేపించారు. ముందు ముందు… కోర్టులు మరిన్ని వ్యతిరేక తీర్పులు ఇస్తే.. జగన్ డోంట్ కేర్ అన్నట్లుగా ఉంటారన్న అంచనాలను.. పరోక్షంగా ఆర్కే వ్యక్తం చేశారు.
కరోనా విషయంలోనూ.. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యాన్ని బలంగా చెప్పేందుకు.. ఆర్కే ప్రయత్నించారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని.. తన నేతలకు జగన్ ఒక్క సారి కూడా పిలుపునివ్వకపోవడంతో జరుగుతున్న అనర్థాలను.. వివరించే ప్రయత్నం చేశారు. వ్యక్తి పూజ కోసం.. దిగజారిపోతున్న వైనాన్ని తప్పు పట్టారు. మొత్తానికి ఆర్కే ఈ వారం ఆర్టికల్ మొత్తాన్ని జగన్మోహన్ రడ్డినే గురి పెట్టారు. దానికి తగ్గ సరంజామా.. వైసీపీ తెచ్చి పెట్టింది.