కాకినాడ పోర్టును అప్పనంగా కొట్టేసిన కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో నోటీసులు జారీ చేసినా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని తప్పించుకున్నారు. ఇప్పుడు ఏ సమావేశాలు లేనందున ఇవాళ ఆయన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. హాజరు కాకపోతే మాత్రం ఈడీ సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
దొంగ ఆడిటింగ్ రిపోర్టులతో బెదిరించి.. వాటాలు రాయించుకున్న తర్వాత ఆ ఆడిటింగ్ రిపోర్టుల్ని కూడా తారుమారు చేయించి… ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేశారు. విజయసాయిరెడ్డితో పాటు వైడ్ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి కీలక పాత్ర. నోటీసులు, రిపోర్టులతో విజయసాయిరెడ్డి బెదిరించగా.. నేరుగా తుపాకులు తీసుకెళ్లి పాయింట్ బ్లాంక్ లో పెట్టి విక్రాంత్ రెడ్డి మిగతా పని పూర్తి చేశారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమంగా నగదు చెలామణి అయిందని ఈడీ గుర్తించి నోటీసులు జారీ చేసింది.
కాకినాడ పోర్టు యజమాని కేవీ రావు తనకు జరిగిన అన్యాయాన్ని సీఐడీకి ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున జరిగిన మనీ లాండరింగ్ గురించి ఈడీకి సమాచారం రావడంతో కేసు పెట్టింది. సీఐడీ ఇంకా ఈ కేసుల్లో దూకుడు చూపించడం లేదు. నిందితులకు న్యాయ అవకాశాలు కల్పిస్తోంది. ఈడీ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది.