జగన్ అక్రమాస్తుల కేసులో వాదించిన లాయర్‌ను సీబీఐ తన లాయర్‌గా పెట్టుకున్న అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ప్రధాన కేసుల్లో నిందితునిగా ఉన్న వారి తరపున వాదించిన లాయర్లను కౌన్సెల్లోకి తీసుకోవాలంటే సీబీఐ అధికారులు అంగీకరించరు. మొదట్లోనే ఆ పేర్లను కొట్టేస్తారు. కానీ ఇక్కడ అనూహ్యంగా హై ప్రోఫైల్ కేసు అయిన జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన తరపున వాదించిన లాయర్లలో ఒకరైన సుభాష్ అనే వ్యక్తిని సీబీఐ తరపున నియమించుకున్నారు.
దీనిపై రఘురామకృష్ణరాజు నేరుగా సీబీఐ డైరక్టర్కే ఫిర్యాదుచేశారు. ఇది దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను దెబ్బ తీస్తుందని గుర్తించారు. అదే సమయంలోఆయన ఆ లేఖలో కొన్ని సంచలనాత్మక ఆరోపణలు చేశారు. అదేమిటంటే సీబీఐలో నియామకాల విషయంలో విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుంటున్నారు.. ఎవరు ఎక్కడ పని చేయాలో ఆయన చెబుతున్నారని అంటున్నారు. దానికి సాక్ష్యంగా గతంలో ఏపీలో నియమితులు కావాల్సి ఉన్న కొందరిపై ఆయన ఆరోపణలు చేస్తూ లేఖలు రాయడం.. దాంతో వేరే వారిని నియమించడం వంటి అంశాలను ప్రస్తావించారు.
కొంత కాలంగా సీబీఐ, ఈడీ వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలను ఆలస్యం చేయడానికి వీరు సహకరిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబధించి వివేకా హత్య కేసు, డాక్టర్ సుధాకర్ కేసు, పోలీసుల అనుచిత ప్రవర్తనపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కేసులు, న్యాయమూర్తులపై దూషణల కేసుల్లో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయినా వేటిలోనూ పురోగతి ఉండటం లేదు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు రాసిన లేఖ కలకలం రేపుతోంది.