విజయసాయిరెడ్డికి జగన్ నెత్తి మీద నెల్లూరు అనే బండ పెట్టి పంపించారని వైసీపీలో సెటైర్లు పడుతున్నాయి. నెల్లూరును పూర్తిగా నిర్వీర్యం చేసుకున్న తర్వాత ఆయనకు బాధ్యతలు ఇచ్చారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నుంచి బయటకు రావడం లేదు. ఆయన సజ్జల మనిషి. విజయసాయిరెడ్డితో అంత ర్యాపో లేదు. ఇప్పుడు వ్యవహారాలన్నీ… ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన చంద్రశేఖర్ రెడ్డి చూసుకోవాల్సి వస్తోంది. ఆయనే విజయసాయిరెడ్డికి స్వాగతం చెప్పేందుకు కాలేజీ పిల్లలకు రూ. వెయ్యిచొప్పున పంచి పంపించారు. మిగతా ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకోవడానికి నియోజకవర్గ స్థాయి నేతలు కూడా ఎవరూ లేరు.
అనిల్ ను నర్సరావుపేట పంపారు. మిగిలిన వారు టీడీపీలో చేరిపోయారు. ఇక మిగిలింది ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆయనే ఇప్పుడు విజయసాయిరెడ్డికి పెద్ద అండగా కనిపిస్తున్నారు. నెల్లూరు సొంత జిల్లా అయినా ఆ జిల్లాతో విజయసాయిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు.కానీ ఇప్పుడు అభ్యర్థిగా అడుగు పెట్టాల్సి వచ్చింది. జగన్ రెడ్డి చెబితే కాదనే పరిస్థితి విజయసాయిరెడ్డికి లేదు. శరత్ చంద్రారెడ్డిని నిలబెడితే తాను చూసుకుంటానని… విజయసాయిరెడ్డి చెప్పినా… నువ్వే పోటీ చేయమని జగన్ పంపించారు.
విజయసాయిరెడ్డి స్టైల్ వేరు… అధికారంతో బెదిరించడంలో ఆయన మాస్టర్. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చే ముందు నెల్లూరు వచ్చి అందర్నీ బెదిరించి.. దాడులు చేయించి.. బుల్ డోజర్లతో ఇళ్లపైకి వెళ్లి పార్టీలో చేర్పించుకుందామంటే కుదరదు. ఇక డబ్బులిచ్చి మ్యానేజ్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు నెల్లూరు రాజకీయం.. డబ్బులకు లొంగే పరిస్థితి దాటిపోయింది. విజయసాయిరెడ్డిని బలి పశువును చేయడానికి .. సజ్జల వేసిన గేమ్ ప్లాన్ లో… ఇరుక్కుపోయారని వైసీపీలోనే చర్చించుకుంటున్నారు.