క్రికెట్ అసోసియేషన్లను నడపాలంటే ఖచ్చితంగా క్రీడాకారులు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు నిర్దేశించింది. అయితే తర్వాత ఏం జరిగిందో కానీ.. అసలు రాజకీయ నాయకులే మొత్తం ఆక్రమించుకుంటున్నారు. బీసీసీఐలో అమిత్ షా కుమారుడు చక్రం తిప్పుతూండగా.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో మొత్తం విజయసాయిరెడ్డి మనుషులు చేరిపోయారు. గతంలో చాముండేశ్వరి నాథ్ లాంటి వాళ్లు కనిపించేవాళ్లు.. ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదు. తాజాగా అపెక్స్ కౌన్సిల్‌కు జరుగుతున్న ఎన్నికల్లో ఆరు స్థానాలకు ఆరుగురు నామినేషన్లు వేశారు. అంతా విజయసాయిరెడ్డి బంధువులు.. స్నేహితులే.
ప్రస్తుతం ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఈయన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి ఢిల్లీలో ఊచలు లెక్కబెడుతున్నారు. ఆయనను తీసేయాల్సింది పోయి.. ఆయన తరపున ప్రతినిధితో మరోసారి ఏసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు దాఖలు చేయించారు. ఉపాధ్యక్షుడిగా ..ఆయన సోదరుడు పి.రోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పేర్లలో విచిత్రాలు చేసే విజయసాయిరెడ్డి తన అల్లుడి పేరు నుంచి రెడ్డి తీసేసి.. పి.రోహిత్ అని నామినేషన్ దాఖలు చేయించారు. ఈయన విజయసాయిరెడ్డి అల్లుడు. అంటే.. అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా అన్నదమ్ములు ఉంటారన్నమాట. ఇక ఇతర నాలుగు పొజిషన్లలోనూ ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. వీరంతా విజయసాయిరెడ్డి సన్నిహితులు.
ఏసీఏకు బీసీసీఐ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. పలుకుబడి ఉంటుంది. బీసీసీఐ ఎన్నికల్లో ఓట్లు కీలకమవుతాయి. అందు కోసం.. ఏసీఏపై పట్టు కోసం విజయసాయిరెడ్డి పూర్తి స్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో.. క్రికెట్ సంఘాలు యాక్టివ్‌గా ఉంటాయి కానీ.. ఏపీలో మాత్రం ఉంటాయో.. ఉండవో ఎవరికీ తెలియదు. క్రికెట్ ప్లేయర్స్‌ను గుర్తించేందుకు కార్యక్రమాలు కూడా చేపట్టరు. వచ్చే నిధులతో మౌలిక సదుపాయాలూ కల్పించరు.