విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పేదలకు నిత్యావసర వస్తువులను ప్రగతి భారతి ట్రస్ట్ పంపిణీ చేస్తోంది. ఈ ట్రస్ట్ ఇచ్చే సహాయ సామాగ్రి మీద ఒకే ఒక్కరి ముద్ర ఉంటుంది. అదే విజయసాయిరెడ్డి బొమ్మ. ఈ ట్రస్ట్ ఆయనదే మరి. ఏ ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ను పెట్టారో.. ఎప్పుడు పెట్టారో కానీ.. ఈ లాక్ డౌన్ సమయంలో మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోయింది. అయితే ఇప్పుడీ ట్రస్ట్ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. ఈ ట్రస్ట్ పేరుతో బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని.. టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. పేదలకు సాయం పేరుతో.. బెదిరించి చందాలు వసూలు చేసి.. వాటి ద్వారా… ప్రజలకు నిత్యావసరాలు పంపుతూ.. సొంత పబ్లిసిటీ చేసుకుంటున్నారని అంటున్నారు.
ప్రగతి భారతి ట్రస్ట్… ఓ మెగా సహాయ శిబిరాన్ని విశాఖలో పెట్టాలనుకుంటోంది. దాని ప్రకారం.. విశాఖలో ఉన్న పేదలందరికీ.. నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలనుకుంటున్నారు. కొన్ని లక్షల మందికి వీటికి అందేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే.. ఇలా చేయాలంటే చాలా పెద్ద మొత్తం ఖర్చవుతుంది. అంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి వస్తుందని… ఆ ట్రస్ట్ లెక్కలను.. ఎవరెవరు చందాలు ఇచ్చారో చెప్పాలని.. టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ప్రగతిభారతి ట్రస్ట్‌కు విజయసాయిరెడ్డి ఒక్క రూపాయి ఇవ్వలేదని… విశాఖలోని పారిశ్రామికవేత్తల్ని బెదిరించి .. చందాలు వసూలు చేస్తున్నారని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. బిల్డర్ అయిన విశాఖ ఎంపీ ద్వారా వివరాలు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని బెదిరిస్తున్నారని.. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపిస్తున్నారు.
సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేపడితే..అందరూ పొగుడుతారు కానీ.. ఇలా చందాలు వసూలు చేసి.. సొంత పేరుతో కార్యక్రమాలు చేపడితే విమర్శలు వస్తాయి. విజయసాయిరెడ్డి పారిశ్రామిక వేత్త కాదు. ఆయన ఆడిటర్ మాత్రమే. ఆయన బంధువులు పారిశ్రామికవేత్తలు . అయితే ఆయన ట్రస్ట్ ఏర్పాటు చేయగానే పోలోమంటూ విరాళాలు ఉత్తినే ఇచ్చే అవకాశం లేదు. ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో పవర్ ఫుల్ రోల్లో ఉన్నారు కాబట్టి విరాళాలు ఇస్తారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అందుకే విమర్శలు వస్తున్నాయి.