బాలినేనిని బుజ్జగించండి లేకపోతే మీరెళ్లి ఆ బాధ్యతలు తీసుకోండి అని జగన్ రెడ్డి .. విజయసాయిరెడ్డికి టాస్క్ ఇచ్చినట్లుగా ఉన్నారన్న గుసగుసలు వైసీపీలో వినిపిస్తున్నాయి. బాలినేని బుజ్జగించడానికి వీ.సా.రెడ్డి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ విజయసాయి స్వయంగా బాలినేని ఇంటికి వెళ్లి గంటకుపైగా చర్చలు జరిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా గతంలో చేసిన రాజీనామాను ఉపసంహరించుకుని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని కోరారు.
అక్కడ రాజకీయంగా విబేధాలున్న వైవీ సుబ్బారెడ్డి పూర్తిగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి హోదాలో పనిచేసుకుంటూ పోతారని సముదాయించినట్లు చెబుతున్నారు. సుబ్బారెడ్డి జోక్యం అంతగా ఉండబోదని కూడా అధిష్టానం హామీ ఇచ్చిందని అంటున్నారు. దీనిపై అటు బాలినేనిగానీ, ఇటు విజయసాయిగానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. బాలినేనిని సముదాయిస్తూనే ఆయన అధిష్టానం మట వినకుంటే ఆయన స్థానంలో విజయసాయి ప్రాంతీయ సమన్వయకర్తగా ఉండాలని స్పష్టం చేసింది. అది విజయసాయిరెడ్డికి ఇష్టం లేదు.
బాలినేని మాత్రం విజయసాయి దౌత్యా నికి కొంత మెత్తబడినట్లు తెలిసినా ఇంకా పూర్తిగా అంగీకారం తెలుపలేదని అంటున్నారు. బాలినేని కూడా వేరే పార్టీలోకి వెళ్లలేక, ఈ పార్టీలో ఉంటూ కార్యకర్తలకు అండగా నిలవలేక మానసికంగా సంఘర్షణకు గురవుతున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం కూడా గుర్తించబట్టే సాచివేత ధోరణి అవలంభిస్తూ వస్తోందని అంటున్నారు.