వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవలి కాలంలో పెద్దగా బయట కనిపించడం లేదు. అలాగని ఆయన ఆజ్ఞాతంలో లేరు. కొన్ని కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. కానీ గతంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్లు వేయడం లేదు.. వైసీపీ కార్యక్రమాల్లోనూ అంత చురుకుగా కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు తాడేపల్లిలో కానీ పార్టీ కార్యాలయాల్లో కానీ ఆయన కనిపించడం అరుదుగా మారింది. దీంతో అసలు ఏం జరిగిందన్న చర్చ వైసీపీలో జోరుగా చర్చ నడుస్తోంది.
విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయ అంశాలపై పెద్దగా స్పందించడం లేదు. ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు హాజరయ్యారు. బెంగళూరులో తన బంధువు అయిన తారకరత్నను పరామర్శించారు. ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఆయనకు పార్టీలో ప్రాధాన్యం పూర్తి స్థాయిలో తగ్గించారని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా పార్టీని అదుపులోకి తీసుకున్నారు. చివరికి గత ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను ఫేక్ ప్రచారాలతో హోరెత్తించడంలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డికి ఇప్పుడు ఆ బాధ్యతలూ లేకుండా చేశారు . సజ్జల కుమారుడు సోషల్ మీడియాను చూస్తున్నారు
చివరికి తాడేపల్లి ప్యాలెస్ లోనూ ఆయనకు అనుమతి లభించడం లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలకు తోడు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ వ్యవహారంతో ఆయన కుటుంబంలో కూడా ఆయనపై వ్యతిరేకత ఏర్పడిందని చెబుతున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒంటరిగా మారిపోయారని మాత్రం వైసీపీలో ఓ క్లారిటీ వచ్చినట్లయిందంటున్నారు.