వైసీపీలో మరో రచ్చ ప్రారంభమయింది. విజయసాయిరెడ్డి వర్సెస్ సుబ్బారెడ్డి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇదంతా విశాఖ విషయంలోనే. విశాఖకు విజయసాయిరెడ్డి చాలా కాలం ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయనను ఉత్తరాంధ్ర సీఎం అని చెప్పుకున్నారు. నడిచినంత కాలం నడిచింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. విజయసాయిరెడ్డి తోకలను జగన్ కత్తిరించారు. కానీ ఆయన మాత్రం విశాఖను వదిలి పెట్టేది లేదంటున్నారు.
ప్రస్తుతం విశాఖ వైసీపీ ఇంచార్జ్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన తాను విజయసాయిరెడ్డి ను పంపేసి సీట్లోకి రాగానే..తన మనుషులకు ప్రాధాన్యం ఇస్తూ పోయారు. విజయసాయిరెడ్డి నియమించిన వారిని పార్టీ పదవుల నుంచి తొలగించారు. తాను నియమించారు. విశాఖపై పట్టు కోల్పోకూడదనుకుంటున్న విజయసాయిరెడ్డి వెంటనే పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుని హోదాలో.. మళ్లీ విశాఖలో తన అనుచరుల్ని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన సంగతి చూస్తామంటున్నారని.. జగన్ దగ్గరే తేలుస్తానని అంటున్నారని చెబుతున్నారు.
వైవీ ధాటికి ఇప్పటికే బాలినేని ఇంటికెళ్లిపోయారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి కూడా అదే పరిస్థితి వస్తుందంటున్నారు. విజయసాయిరెడ్డి హైకమాండ్ విశ్వాసాన్నికోల్పోయారు. ఢిల్లీలోనే ఎక్కువ ఉంటుంది. ఇటీవల బాలినేని వదిలేసిన పోస్టు ఆయనకు ఇచ్చారని చెప్పుకున్నారు. కానీ ఇలా బాధ్యతలిచ్చారని ఆయన ట్విట్టర్లో కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దీంతో ఏదో జరుగుతోందని అందరికీ అర్థమైంది. ముందు ముందు ఈ ఇద్దరు పెద్దారెడ్ల పేరు వైసీపీలో ముదిరే అవకాశం ఉంది.