డిటెక్టివ్ కథలు ఎవర్ గ్రీన్. మెదడుకి పదునుపెడుతూ సాగే నేర పరిశోధన అంటే ఈ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులు ఎలర్ట్ అయిపోతారు. ఇప్పుడు నరేష్ అగస్త్య ఓ డిటెక్టివ్ సిరిస్ తో వచ్చాడు. అదే… వికటకవి. ఆరు ఎపిసోడ్స్ వున్న ఈ సిరిస్ జీ5లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. 1940-70 మధ్య సాగే పిరియాడిక్ డిటెక్టివ్ కథ ఇది. మరి ఈ డిటెక్టివ్ ఎలాంటి కేసుని హ్యాండిల్ చేశాడు? ఎలాంటి నిజాలు వెలికితీశాడు? ప్రేక్షకులుని ఎంతలా థ్రిల్ చేశాడు?
అది 1970. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోని ‘అమరగిరి’ అనే ఊరు. రాజా నరసింహరావు (షిజూ మీనన్) ఆ గ్రామానికి పాలకుడు. అమరగిరి ప్రజల్ని ఓ వింత జబ్బు వెంటాడుతుంది. కొన్నేళ్ళ క్రితం ఆ ఊరికి సమీపంలో ఉన్న దేవతల గుట్టపై జాతర జరుగుతున్న సమయంలో పెద్ద వర్షం కురిసి వందమందికి పైగా ప్రజలు చనిపోతారు. దేవత శాపం వల్లే అలా జరిగిందని ఊరివాళ్లు నమ్ముతారు. అప్పటినుంచి ఆ గుట్ట పైకి ఎవరూ వెళ్లరు. పొరపాటున ఎవరైనా వెళితే జ్ఞాపకశక్తి కోల్పోతారు. అలా జ్ఞాపకశక్తి కోల్పోయిన వారిని ఓ గదిలో పెట్టి తాళం వేస్తారు. ఇలా మతికోల్పోయి జీవచ్ఛవాల్లా బరుతుకున్న వారి సంఖ్య ముఫ్ఫై రెండు చేరుతుంది.
రామకృష్ణ (నరేశ్అగస్త్య) ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. తనో పార్ట్ టైం డిటెక్టివ్. పోలీసులకు అంతుచిక్కని క్రైమ్స్ ని తన తెలివితేటలతో సింపుల్ గా తెల్చేస్తుంటాడు. అలా సంపాదించిన డబ్బు తన తల్లి వైద్యం కోసం ఖర్చు పెడుతుంటాడు. రామకృష్ణ తెలివితేటల్ని పసిగట్టిన ప్రొఫెసర్ వేణుగోపాల్.. తనని అమరగిరికి పంపుతాడు. అమరగిరికి వచ్చిన రామకృష్ణకు ఎలాంటి సంఘటనలు ఎదురైయ్యాయి? అక్కడ ప్రజలు జ్ఞాపకశక్తిని కోల్పోవడానికి కారణం ఏమిటి? నిజంగా ఆ వూరికి శాపం ఉందా? ఈ కథలో లక్ష్మీ (మేఘ ఆకాష్) పాత్ర ఏమిటి? అమరగిరి వెనుక అంతుచిక్కని రహస్యాలు ఏమున్నాయి? ఇదంతా మిగతా కథ.
డిటెక్టివ్ కథ అనగానే ఆడియన్స్ ఖచ్చితంగా మలుపులని, వేగాన్ని, ముఖ్యంగా తెలివైన కథనాన్ని ఆశిస్తారు. రహస్య చేధనలో సహజంగానే డిటెక్టివ్ తో పోటీపడతారు. వారి అంచనాలకి మించిన మలుపులు వుంటేనే కథలో లీనం అవుతారు. వికటకవిలో కథ వుంది, మలుపులు వున్నాయి. మిస్టరీ వుంది. అయితే వీటిని నడిపిన విధానమే అంతగా రక్తికట్టించేలా అనిపించలేదు.
అమరగిరి ఊరిలో ఓ మార్మిక సంఘటనతో ఈ కథ ఆసక్తిగా మొదలౌతుంది. తర్వాత డిటెక్టివ్ గా రామకృష్ణ పరిచయంలో వచ్చే ఎపిసోడ్ అంత బలంగా అనిపించదు. పాకిస్తాన్ కొండ గుర్తుతో ఓ నేరస్తుడిని పట్టుకోవడం టూ మచ్ అనిపిస్తుంది. అయితే డిటెక్టివ్ పరిచయం ఇంత పేలవంగా వునప్పటికీ అమరగిరి సెటప్ మాత్రం బిగినింగ్ లో ప్రేక్షకుడిని కథలో కూర్చోబెడుతుంది. అసలు అక్కడి మనుషులు మతి ఎలా కోల్పోతున్నారు? దీని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది.
అయితే ఎప్పుడైతే డిటెక్టివ్ తల్లి పాత్రతో ఈ కథకు ముడివేశారో అక్కడి నుంచి వచ్చే మలుపులన్నీ ముందుగానే ఊహకు అందిపోతాయి. కథలో ట్విస్ట్ లు ఉన్నపటికీ అవి రివిల్ అయిన విధానం అంత గొప్పగా లేకపోవడం పెద్ద మైనస్. ఫ్లాష్ బ్యాక్, ప్రయోగం నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు అయితే మరీ సాగదీత అనిపించాయి. ఒకదశలో వికటకవి జోనర్ మారిపోయి ఫ్యామిలీ స్టొరీ అయిపోతుంది. అందులో ఎమోషన్స్ ఏవీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. హైదరాబాద్- పాకిస్తాన్ విభజన, శ్రీశైలం ప్రాజెక్ట్స్ కోణాలు కథలో సరిగ్గా కూర్చోలేదు. హీరోకి వున్న సమస్యనే ఆయుధంగా చేసుకొని ఈ కథకు ముగింపుని ఇచ్చిన విధానం మాత్రం ఆకట్టుకొంటుంది. అయితే క్లైమాక్స్ వచ్చేసరికే ఈ కథ పై ప్రేక్షకుడి ఆసక్తి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది.
డిటెక్టివ్ పాత్రలో నరేశ్ అగస్త్య గీత దాటకుండా చేశాడు. తన లుక్స్ ఇలాంటి పాత్రలు నప్పుతాయి. అయితే ఈ సిరిస్ మైనస్ ఏమిటంటే నరేశ్ అగస్త్య పాత్ర తప్పితే మరో నటుడు ఆకట్టుకునే నటన కనబరచలేదు. మేఘా ఆకాశ్ కథకు ఎంత మాత్రం వాల్యూ యాడ్ చేయలేదు. షైజు పాత్రకు చాలా నిడివి వుంది. కానీ ఆయన నుంచి ప్రభావంతమైన నటన రాబట్టుకోలేకపోయారు. ముక్తార్ ఖాన్, అమిత్ తివారీ పాత్రలు కూడా అంతే. పోలీస్ గా చేసిన రవితేజ నిమ్మల క్యారెక్టర్ ని సీరియస్ గా చూడాలో కామెడీగా తీసుకోవాలో అర్ధం కాదు. రఘు కుంచె లుక్స్ ఎలా డిజైన్ చేశారో కానీ ఈ కథలో థ్రిల్ ని తగ్గించేసిన క్యారెక్టర్ అది. మహాదేవ గా నటించిన తారక్ పొన్నప్ప మాత్రం కొంత మేరకు పర్వాలేదనిపించారు.
టెక్నికల్ గా ఎఫర్ట్ పెట్టారు. 50, 70 నాటి వాతావరణాన్ని చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టపడింది. రామోజీలో వేసిన సెట్స్ లో భారీతనం లేకపోయిన ప్రయత్నం అయితే కనిపించింది. కెమెరాపనితనం, మ్యూజిక్ డీసెంట్ గా వున్నాయి. దర్శకుడు ప్రదీప్ మద్దిలి యాంబియన్స్ పై బాగానే దృష్టి పెట్టాడు. సిరిస్ టైటిల్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఈ కంటెంట్ కి వికటకవి అనేది నాన్ సింక్ టైటిల్. చివర్లో జస్టిఫికేషన్ ఇచ్చారు కానీ సెట్ అవ్వలేదనిపిస్తుంది. కంటెంట్ కి తగ్గట్టు ‘ఆపరేషన్ అమరగిరి’ లాంటి పేరేదో పెట్టాల్సింది. ఆరు ఎపిసోడ్స్. ఒకొక్క ఎపిసోడ్ నిడివి 40 నిముషాలు. చివరి మూడు ఎపిసోడ్స్ ఇంకా షార్ఫ్ గా ఉండాల్సింది. మాంచి డిటెక్టివ్ సిరిస్ చూడాలనే ఉత్సాహంతో మొదలు పెడితే కనుక వికటకవి అక్కడక్కడ మెప్సిస్తాడు. మరికొంత బడ్జెట్ ఇచ్చుంటే ఈ సిరీస్ ఇంకొంచెం క్వాలిటీగా తీసి ఉండేవారేమో.