ఈ రోజుల్లో ఓ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ రావడం అంటే మామూలు విషయం కాదు. అందునా డబ్బింగ్సినిమాకి. అందులోనూ వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోకి. ఆ ఘనత సాధించిన సినిమా ఇంకొక్కడు. విక్రమ్ నటించిన సినిమా ఇది. నయనతార, నిత్యమీనన్ కథానాయికలు. విక్రమ్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో. అపరిచితుడు తరవాత అసలు హిట్టనేదే తెలియకుండా పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న శంకర్ చిత్రం ఐకూడా డిజాస్టర్ జాబితాలో చేరింది.
తమిళ్లో విక్రమ్ నటించిన ఇరుమురుగన్.. ఇప్పుడు ఇంకొక్కడు పేరుతో తెలుగులోకి వస్తోంది. ఈ సినిమా డబ్బింగ్ నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టడం విశేషం. డబ్బింగ్ రైట్స్‌ని రూ.5 కోట్లకు చేజిక్కించుకొన్నారు నిర్మాతలు. వాళ్ల నుంచి అభిషేక్ పిక్చర్స్ సంస్థ రూ.8 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసింది. అంటే.. ఇప్పటికే మూడు కోట్ల లాభం వచ్చిందన్నమాట. శాటిలైట్ ఎంతకాదన్నా కోటి పలుకుతుంది. మొత్తానికి నాలుగు కోట్ల లాభాన్ని దక్కించుకొన్నట్టు.
ఓ డబ్బింగ్ సినిమాకి ఈ రేంజులో లాభాలు రావడం మామూలు విషయం కాదు. ఇటీవల కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగునాట మంచి వసూళ్లనే అందుకొంటున్నాయి. బిచ్చగాడు సినిమా రూ.20 కోట్లు కొల్లగొట్టి ఆశ్చర్యపరిచింది. విక్రమ్ సినిమాలకు తెలుగులో ఇంకా క్రేజ్ తగ్గలేదు. దానికి తోడు నయనతార, నిత్యమేనన్ల ఇమేజ్ కూడా ఈ సినిమాకి కలిసొచ్చే విషయమే. బీసీల్లో నిలదొక్కుకోగలిగితే రూ.8 కోట్లు రాబట్టుకోవడం అంత కష్టమేం కాదు. అందుకే. ఇంకొక్కడకు కోట్లు కురిశాయి.