అక్కినేరని కుటుంబానికీ, విక్రమ్ కె.కుమార్కీ ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కుటుంబానికి మనం లాంటి మర్చిపోలేని సినిమాని విక్రమ్ అందించాడు. ఆ తరవాత అఖిల్ తో `హలో` చేశాడు. ఇప్పుడు.. నాగచైతన్యతో `థ్యాంక్యూ` చేశాడు. ఆ సినిమా బయటకు రాకుండానే… చైతూతో ఓ వెబ్ సిరీస్ పట్టాలెక్కించేశాడు. ఆ వెబ్ సిరీస్ కూడా.. దాదాపుగా పూర్తి కావొచ్చింది. `థ్యాంక్యూ` త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా గురించి, అందులోని చైతూ పాత్ర గురించీ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు
“ఈ కథని చైతూ ఒక్కడే చేయగలడు. ఎందుకంటే.. ఇందులో హీరో మూడు భిన్నమైన రూపాల్లో కనిపించాలి. అందులో పదహారేళ్ల పాత్ర కూడా ఉంది. ఆ పాత్రని మరొకరితో చేయించలేం. గ్రాఫిక్స్‌లో మ్యాజిక్ చేసి ఆ పాత్రని సృష్టించలేం. పదహారేళ్ల పిల్లాడిగా చైతూ మారిపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ పాత్రకు సంబంధించిన సీన్స్ చేస్తున్నప్పుడు తను బాగా కష్టపడ్డాడు. కేవలం ఆ పాత్ర కోసమే… 45 రోజుల పాటు కఠినమైన డైట్ పాటించాడు. ఇదంతా చైతూ మాత్రమే చేయగలడు..“ అని చైతూ కష్టాన్ని వివరించాడు.
విక్రమ్ కె.కుమార్ ప్రస్తావన ఎప్పుడొచ్చినా `24 సీక్వెల్ ఎప్పుడు` అనే చర్చ మొదలవుతుంది. దీనికీ.. ఆయన సమాధానం చెప్పాడు. “24 సీక్వెల్ చేయాలని నాకూ ఉంది. అందుకోసం ఆలోచిస్తున్నాను. మొన్నే.. నాలుగైదు పేజీల్లో కథ కూడా రాశాను. దానిపై ఏగాగ్రతతో పనిచేయాలి. సూర్యతో మరో టైమ్ ట్రావెల్ కథ తీయాలి అనుకుంటే.. ఆ పని నాకు చాలా తేలిక. కానీ.. ఆత్రేయ లాంటి పాత్రని కొనసాగిస్తూ ఆ కథ చెప్పాలి అంటేనే కష్టం. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోంద“న్నారు.