మనం లాంటి క్లాసిక్ సినిమాకి అన్నపూర్ణ స్టూడియోకీ, అక్కినేని ఫ్యామిలీకీ అందించాడు విక్రమ్ కె.కుమార్. అతనంటే నాగార్జునకు బాగా గురి. మనం లాంటి అపురూపమైన సినిమా ఇచ్చినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపిస్తూనే ఉంటాడు. కాకపోతే… ఓ విషయంలో విక్రమ్‌కీ నాగ్‌కీ మధ్య క్లాష్ వచ్చినట్టు సమాచారం. అఖిల్ – విక్రమ్ కె.కుమార్ కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈపాటికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ కథ విషయంలో నాగ్ కొన్ని మార్పులూ చేర్పులూ చెప్పడంతో విక్రమ్ కొత్త కథని రాసుకోవాల్సివస్తోంది. కాబట్టే ఈ సినిమా ఆలస్యం అవుతోంది.
తొలిసారి వినిపించిన కథపై విక్రమ్ ఇప్పటికీ కాన్ఫిడెంట్ గానే ఉన్నాడట. ”ఈ కథ తప్పకుండా జనాలకు నచ్చుతుంది.. ఇదే చేద్దాం” అంటూ నాగ్ని బతిమాలాడట విక్రమ్. 24 సినిమాని కథగా చెప్పినప్పుడు చాలా డౌట్లు వస్తాయని, సినిమాగా మలిచినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారని, అఖిల్ కథ విషయంలోనూ ఇంతే అని సర్ది చెప్పబోయాడట. కానీ… ఎంత కన్వెన్స్ చేయడానికి ప్రయత్నించినా నాగ్ ఒప్పుకోకపోవడంతో విక్రమ్ నాగ్‌పై కాస్త అలిగాడట. రెండో సారి వినిపించిన కథపై కూడా నాగ్ కాస్త సవరణలు ఇవ్వడానికి దిగడంతో విక్రమ్ బాగా హర్టయినట్టు తెలుస్తోంది. ఓ సందర్భంలో ”మీ అబ్బాయికి ఎలాంటి కథ కావాలో మీరే చెప్పండి. నేను తీసి పెడతా..” అనే స్థాయికి తన అసహనం వెలిబుచ్చాడట. దాంతో… నాగ్ కాస్త తగ్గాడని తెలుస్తోంది. ఇక కథ విషయంలో జోక్యం చేసుకోను… క్యారీ ఆన్…. అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి అఖిల్‌తో సినిమా చేయాలని విక్రమ్‌కి లేదు. తనకి చాలా పెద్ద ప్రాజెక్టులే వస్తున్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి కేవలం నాగ్ మాటని కాదనలేక ఈ ప్రాజెక్టు అందిపుచ్చుకొన్నాడు విక్రమ్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాగ్ మితిమీరిన జోక్యం చేసుకోవడం విక్రమ్‌కి ఇబ్బందిగా పరిణమించిందని టాక్.