నాగచైతన్య, విక్రమ్ కుమార్ లది ‘మనం’ లాంటి క్లాసిక్ అందించిన కాంబినేషన్. అయితే రెండో ప్రయత్నంగా చేసిన థాంక్యూ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు చైతుతో ‘దూత’ వెబ్ సిరిస్ చేశారు విక్రమ్. డిసెంబర్ 1న ఇది ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సమయంలోనే థాంక్యూ సినిమా ప్రస్తావన వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయానికి కారణం చెప్పారు విక్రమ్.
”థాంక్యూ కథ కరోనా లాక్ డౌన్ మైండ్ సెట్ నుంచి పుట్టింది. జీవితాన్ని అందరూ గొప్పగా బ్రతికేయాలని అనుకుంటారు. కానీ మనిషి బ్రతకడానికి డబ్బు హోదా పలుకుపడే ప్రధాన లక్ష్యం కాదనే ఓ ఆలోచన, ధోరణి ఆ సమయంలో కనిపించింది. చాలా మంది కేవలం ఒక షార్ట్ తో నెలలు గడిపేశారు. జీవితం పట్ల వ్యక్తుల పట్ల కృతజ్ఞత వుండటం అన్నితికంటే గొప్ప విషయం అనిపించింది. ఆ కోణంలో థాంక్యూ కథకు శ్రీకారం చుట్టాం. అయితే ఆ ఎమోషన్ ఎవరికీ కనెక్ట్ కాలేదు. సినిమా వచ్చే నాటికి ప్రేక్షకులు మూడ్ కూడా మారిపోయింది. యూత్ లో చాలా మంది అసలు కృతజ్ఞత గురించి అలోచించే మూడ్ లోనే లేరు. యాబై ఏళ్లకు పైబడినవారు అలోచుస్తారేమో. కానీ మేము యూత్ టార్గెట్ గా థాంక్యూ ని మలిచాం. అది రాంగ్ క్యాటరింగ్. ఆ సినిమా అపజయానికి అదొక కారణం” అని చెప్పుకొచ్చారు విక్రమ్.