ఐ సినిమా ముందు జరిగిన పబ్లిసిటీ గుర్తుంది కదా? ఆసినిమా కొనడానికి తెలుగు నుంచి బయ్యర్లు క్యూ కట్టారు. అంతకు ముందు విక్రమ్ ట్రాక్ రికార్డ్ ఏమాత్రం బాలేదు. అయితే సరే, శంకర్‌పై ఉన్న నమ్మకంతో ఐ సినిమాని కోట్లు పోసి కొన్నారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. తెలుగు నాట విక్రమ్ మార్కెట్ ధడేలున పడిపోయింది. విక్రమ్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు లైట్ తీసుకొనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు విక్రమ్ ఆశలన్నీ… ఇంకొక్కడు సినిమాపైనే. ఇదో సైంటిఫిక్ థ్రిల్లర్. నయనతార, నిత్యమీనన్ కథానాయికలుగా నటించడంతో ఈ సినిమాకి కొత్త గ్లామర్ వచ్చింది. ట్రైలర్ కూడా ఓకే అనిపించుకొంది. తెలుగు రైట్స్ ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ దక్కించుకొంది. కేవలం.. రూ.4 కోట్లకే.
అపరిచితుడు తరవాత విక్రమ్ సినిమా తెలుగులో ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. ఈమధ్య తెలుగులో డబ్బింగ్ సినిమాలు సరిగా ఆడడం లేదు. దానికి తోడు విక్రమ్ సినిమాలకు బాగా గిరాకీ తగ్గిపోయింది. అందుకే ఇంకొక్కడు సినిమాపై ఎవ్వరూ దృష్టి పెట్టలేదు. అందుకే ఇంత చీప్ ధరకు దొరికేసింది. అయితే ఈసారి సినిమాకి బాగా పబ్లిసిటీ చేయాలని విక్రమ్ నిర్ణయించుకొన్నాడని టాక్. ఇంకొక్కడ ప్రమోషన్లను టాలీవుడ్లో భారీగా చేద్దామనుకొంటున్నాడట. ఇందుకోసం చరణ్, బన్నీలాంటి వాళ్లని పట్టుకోవాలని చూస్తున్నాడు. మెగా హీరోలు మైకు పట్టుకొంటే.. సినిమాలకు వచ్చే మైలేజే వేరుగా ఉంటుంది కదా? విక్రమ్ అదే కోరుకొంటున్నాడిప్పుడు.