రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. చరణ్‌కు ఇది 16వ సినిమా అవుతుంది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పిరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ లో సాగే కథ ఇది. కాస్ట్యూమ్స్ కి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకోసం తమిళ చిత్రసీమ నుంచి ఏగన్ ఏకాంబరం ను ఎంపిక చేశారు. ఇటీవల విడుదలైన ‘తంగలాన్’ చిత్రానికి కాస్ట్యూమ్స్ అందించారు ఏగన్. ఆ చిత్రంలో ఏకాంబరం ఎంపిక చేసిన ప్రతీ కాస్ట్యూమ్ కథని, ఆ సన్నివేశాన్ని, ఆ కాలాన్ని ఎలివేట్ చేశాయి. పిరియాడిక్ డ్రామా కాబట్టి, ఏకాంబరం లాంటి అనుభవం ఉన్న సాంకేతిక నిపుణుడైతే కథకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో చిత్రబృందం ఆయన్ని ఎంపిక చేసింది. తెలుగులో పని చేయడం ఆయనకు ఇదే తొలిసారి.
స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ ఇది. చరణ్ కుస్తీ వీరుడిగా కనిపించనున్నాడని టాక్. మల్లయుద్ధ వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు జీవితాన్ని ఆధారంగా ఈ కథ రాసుకొన్నాడన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కథాయికగా జాన్వీ కపూర్ దాదాపుగా ఖాయం అయినట్టే. ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు ముందే ఈ సినిమా పట్టాలెక్కాల్సింది. అయితే ఈ సినిమా కోసం చరణ్ ప్రత్యేక శిక్షణ తీసుకొంటున్నాడు. ఆ ట్రైనింగ్ పూర్తయిన తరవాతే.. షూటింగ్ మొదలు కానుంది. అందుకు కాస్త సమయం పట్టేట్టు ఉంది. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ముమ్మరం చేశాడు బుచ్చిబాబు. ఏ.ఆర్.రెహమాన్ తో ఓ దఫా సిట్టింగ్ పూర్తయ్యింది. ఇప్పటికి మూడు ట్యూన్లు సిద్ధమైనట్టు తెలుస్తోంది.