శివపుత్రుడుతో షాక్ ఇచ్చిన విక్రమ్…. అపరిచితుడుతో స్టార్ అయిపోయాడు. ఒక్కసారిగా ఎంత ఎత్తుకు ఎదిగాడో, అంతే త్వరగా కింద పడ్డాడు. కథల ఎంపికలో చేసిన తప్పులు, మితిమీరిన అంచనాలు, ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వెరసి విక్రమ్ విజయాలకు దూరమయ్యాడు. తెలుగులోనూ తన మార్కెట్ దారుణంగా పడిపోయింది. తమిళంలో విక్రమ్ సినిమా విడుదలైనా -దాన్ని తెలుగులో డబ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. అయితే చాలా రోజుల గ్యాప్ తరవాత.. తనో సినిమా చేశాడు. ఇప్పుడు అది `మిస్టర్ కె.కె.` పేరుతో తెలుగులోనూ విడుదల అవుతోంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో ఈసినిమాపై ఫోకస్ పెరిగింది. ట్రైలర్‌తో అంచనాలూ మొదలయ్యాయి. ఇదో క్రైమ్ థ్రిల్లర్. సమర్థుడైన కమాండోగా పేరొందిన కె.కె. (విక్రమ్) హంతకుడిగా ఎందుకు మారాడు? ఎలా మారాడు? అనేదే కాన్సెప్ట్. ట్రైలర్లో యాక్షన్ మూమెంట్స్‌కి ఎక్కువ చోటిచ్చారు. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. విక్రమ్ లుక్, గెటప్ బాగున్నాయి. విజువల్స్ కూడా భారీగానే కనిపిస్తున్నాయి. థ్రిల్లర్ చిత్రాలకు మంచి గిరాకీ ఏర్పడిన ఈ టైమ్‌లో విక్రమ్ హిట్టు కొడతాడేమో చూడాలి.