ఒక్కసారి మేకప్ వేసుకొన్న తరవాత, ‘సినిమా’ అనే రుచి మరిగాక… వేషాన్ని తీయడం, సినిమాల్ని వదిలేయడం చాలా చాలా కష్టం. ప్రాణం ఉన్నంత వరకూ నటనకే జీవితాన్ని అంకితం చేస్తారు. పైగా చేతిలో విజయాలు, క్రేజ్ ఉన్నప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పడం ఓరకంగా దుస్సాహసమే. అలాంటిదే చేశాడు బాలీవుడ్ హీరో విక్రాంత్ మాన్సే. `టెన్త్ ఫెయిల్` సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, ఎన్నో అవార్డులు, రివార్డులూ పొందిన నటుడు విక్రాంత్. 2025 తరవాత సినిమాలకు వీడ్కోలు చెబుతానంటూ ఓ ట్వీట్ చేయడం ఆయన అభిమానులతో పాటు, బాలీవుడ్ కూ షాక్ లో పడేసింది.
తన కుటుంబానికి పూర్తి స్థాయి సమయం కేటాయించాల్సిన అవసరం వచ్చిందని, అందుకే సినిమాలు మానేస్తున్నానని 2025లో తన నుంచి వచ్చే చిత్రమే.. చివరి చిత్రం అవుతుందని, ఇన్నాళ్లుగా తనని ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాలో ఓ నోట్ పెట్టాడు విక్రాంత్. ప్రస్తుతానికి ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న విక్రాంత్ ఇలాంటి సడన్ నిర్ణయం ఎందుకు తీసుకొన్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఈమధ్య కొంతమంది సెలబ్రెటీలు ట్విట్టర్ లో ఫేక్ పోస్టులు పెట్టి, అభిమానుల్ని ఫూల్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫ్రాంక్ చేస్తున్నారు. ఈ పోస్ట్ ని కూడా ఇందులో భాగంగానే చూడాలా? లేదంటే నిజంగానే విక్రాంత్ మాన్సే సినిమాలకు దూరం అవుతున్నాడా? అనే గందరగోళంలో ఉన్నారు ఫ్యాన్స్. 2013లో లూటేరా సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు మాన్సె. హాఫ్ గాళ్ ఫ్రెండ్, చపాక్, కార్గో, హసీనా దిల్ రూబా, లవ్ హాస్టల్, ఫోరెన్సిక్, సెక్టార్ 36 లాంటి సినిమాలు అతని ఖాతాలో ఉన్నాయి. మాన్సె వయసు కేవలం 37 ఏళ్లు మాత్రమే. తనకు ఇంకా చాలా కెరీర్ ఉంది. అంతలోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకొన్నాడో మరి. మాన్సే నటుడిగా కొనసాగాలని, ఆయన్నుంచి అద్భుతమైన పాత్రలు చూడాలని అభిమానులు కోరుకొంటున్నారు.