జగనన్న ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాడని…సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను సైతం వదిలి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగంలో చేరిన వారికి ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. తమ జీవితం దుర్భరమైపోయిందని… మొత్తంగా ఒక్క అడుగుతో నాశనం చేసుకున్నామని బాధపడే పరిస్థితి వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇక ముందు ఎలాంటి ప్రమోషన్లు ఉండవు. ఇప్పుడు వారు ఏ పని చేస్తున్నారో.. ఏ క్యాడర్లో పని చేస్తున్నారో.. అదే పని..అదే క్యాడర్లో రిటైరయ్యే వరకూ ఉండాలి. ఎదుగూబొదుగూ ఉండదు. జీవితంలోనే కాదు.. జీతంలోనూ ఎదుగూబొదుగూ ఉండదు.
ఎందుకంటే క్యాడర్ పెరగనిదే జీతం పెరగదు. ప్రభుత్వాలు ఎప్పుడో దయతలిచి ఇచ్చే పీఆర్సీల ద్వారానే జీతం పెరగాలి. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఈ పీఆర్సీల్లో కూడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు విడిగా జీతాల పెంపును నిర్దేశించే ప్రమాదం ముందు ముందు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేయడం వల్ల రూ. పదిహేను వేల నుంచి పాతిక వేలకు జీతం పెరుగుతుంది. అది తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలను ఏమీ వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో విధి నిర్వహణలో మాత్రం ఒత్తిడి విపరీతంగా పెరగనుంది.
ప్రభుత్వ పరంగా ఏ పని చేయాలన్నా భారం వీరిపైనే పడనుంది. అదే సమయంలో వీరు నియామకాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వీరంతా వైసీపీ హయాంలో సరైన ప్రవేశ పరీక్ష లేకుండా నియమితులయ్యారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అదే ప్రభుత్వం మారితే వీరిపై వివక్ష చూపించే అవకాశం ఉంది. అదే జరిగితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మరింత ఇబ్బంది పడతారు.