గ్రామ, వార్డు సచివాలయాల గురించి జగన్ రెడ్డి గొప్పగా చెబుతూంటారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం తెచ్చామని ఫుల్ పేజీ యాడ్స్ కోట్లు పెట్టి కుమ్మరిస్తూంటారు. కానీ ఈ వ్యవస్థ గాంధీజీ కలలపై గొడ్డలి పోటు వేసేదని.. పంచాయతీల్ని నిర్వీర్యం చేసేదని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఇప్పుడు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా అదే చెబుతున్నారు. 020-21 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ నివేదికల్ని కాగ్ అసెంబ్లీకి సమర్పించింది. ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటును కాగ్ తీవ్రంగా తప్పు పట్టింది.
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా వ్యవస్థ ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమన ిస్పష్టంచేసింది. వార్డు కమిటీలు లేకుండా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు ఆడిట్ నివేదికలో వెల్లడించింది. వికేంద్రీకరణ పాలన కోసం వ్యవస్థ ఏర్పాటు చేసినట్లుగా ఉందని.. 2019 జులైలో ఏర్పాటు చేసిన వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని కాగ్ స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయిలో వ్యవస్థ ఏర్పాటు స్థానిక స్వపరిపాలనను దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులతో వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. స్వపరిపాలన సాధనకు వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
గ్రామ , వార్డు సచివాలయాల వల్ల సర్పంచ్ల ను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. వారికి ఇచ్చే నిధుల్ని కాజేస్తున్నారు. గ్రామాల్లో ఏమైనా పనులు చేయాలంటే … గ్రామ, వార్డు సచివాలయాలకే నిధులు ఇస్తున్నారు. ఇదంతా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని భూస్థాపితం చేయడమేనని నిపుణులు ఎప్పటి నుండో హెచ్చరిస్తున్నారు. కాగ్ రిపోర్టులో ఇంకా అనేక కీలక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.