ఇప్పటి వరకూ వైఎస్ఆర్ కుటుంబసభ్యులుగా ఉన్నవారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు..!
ఉద్యోగాలు పొందిన వారంతా.. ఆయనను రోజూ పూజించాలి..!
దేవుని బిడ్డ కాబట్టే దేవుడిలా జగన్ ఉద్యోగాలిచ్చారు..!
ఇవన్నీ.. ఉద్యోగ నియామక పత్రాలు అందించే వేడుకల్లో వినిపించిన కొన్ని వాక్యాలు. ఇలాంటి స్తోత్రాలు అన్ని జిల్లాల్లో జరిగాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పాల్గొన్న వేదికపైనే.. దాదాపుగా.. ఓ ప్రార్థన స్థాయిలో.. ఏపీ మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ స్తోత్రం వినిపించారు. దేశానికి స్వర్ణయుగం గుప్తుల కాలమైతే.. ఏపీకి ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అధికారం చివరి రోజుల్లో మేనిఫెస్టోను అమలు చేసే ప్రభుత్వాలనే చూశామని రాజకీయ కామెంట్లు కూడా చేశారు. తొలి ఆరు నెలల్లోనే మేనిఫెస్టో అమలును పూర్తి చేస్తున్న తొలి సీఎం జగన్ అని విజయ్ కుమార్ పొగడ్తల వర్షం కురిపించేశారు. విజయకుమార్ ప్రసంగం విని..వేదికపై ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా కాస్త సిగ్గుపడాల్సి వచ్చింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారందరికీ..జిల్లాలవారీగా నియామక పత్రాలు అందించారు. అన్ని చోట్లా.. అందరికీ ఒకే సందేశం వెళ్లింది. జగన్మోహన్ రెడ్డి గొప్పతనాన్ని గ్రామ గ్రామానా చెప్పాలన్నది ఆ సందేశం. దీనని… వేదికపై ఉన్న వారి నుంచే ప్రారంభించారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం..ఈ పొగడ్తల కన్నా… ఉద్యోగం పొందిన వారికి దిశానిర్దేశమే ఎక్కువగా చేశారు. పేదవాడి చిరునవ్వును గుర్తు చేసుకోవాలని సూచించారు. జనవరి ఒకటో తేదీ నుంచి 500 రకాల సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. లంచాలు తీసుకోకుండా.. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసి..ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు.
నాలుగు నెలలు గడవక ముందే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి.. చరిత్ర సృష్టించామని.. జగన్ ప్రకటించారు. గ్రామ వాలంటీర్లందరికీ స్మార్టు ఫోన్లు ఇస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికీ ఉద్యోగాలు పొందని వారు నిరాశపడవద్దని.. జనవరి నుంచి… నియామకాల క్యాలెండర్ను విడుదల చేస్తామని.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ ప్రతీ యేటా జనవరిలో భర్తీ చేస్తామని ప్రకటించారు.