గ్రామ సచివాలయాలు జనవరి ఒకటో తేదీ నుంచి సేవలందిస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శరవేగంగా ఉద్యోగుల్ని నియమించి… గాంధీ జయంతి రోజున గ్రామ, వార్డు సచివాలయాల్ని ప్రారంభించేసినప్పటికీ.. మూడు నెలల తర్వాతే అవి సేవలందిస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించడం… చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలాయలకు కావాల్సిన సరంజామా కోసం నిధులు విడుదల చేశారు. కుర్చీలు, కంప్యూటర్లు అన్నీ సిద్ధం చేశారు. ఉద్యోగుల్ని అఘమేఘాలపై నియమించారు. అయినప్పటికీ.. మూడు నెలల తర్వాతే సేవలు ప్రారంభమని జగన్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన జగన్ … కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా సచివాలయ ఉద్యోగుల నియమించామని ప్రకటించారు. సచివాలయ ఉద్యోగులకు అనుసంధానంగా గ్రామ వాలంటీర్లు ఉంటారని.. గ్రామ సచివాలయాల ద్వారా 500రకాల సేవలు ప్రజలకు అందుతాయన్నారు.
మళ్లీ గెలిచేలా పాలన ఉండాలని సచివాలయ ఉద్యోగులు గుర్తుంచుకోవాలని జగన్ దిశానిర్దేశం చేశారు. గత ఐదేళ్లలో ఏ పనికైనా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని… తమ కార్యకర్తలకే జన్మభూమి కమిటీలు ప్రాధాన్యత ఇచ్చేవని గుర్తు చేశారు. అర్హుల ఇంటికే సంక్షేమ పథకాలు చేరుస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సచివాలయం పక్కన ఎరువులు-విత్తనాల కేంద్రం.. వ్యవసాయ పనిముట్ల వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. అభివృద్ధిలో సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లది కీలకపాత్ర పోషించాలన్నారు. మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో మౌలికవసతులు కల్పిస్తామని .. స్కూళ్లు, పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మార్పులు తీసుకొస్తామని మరోసారి చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం రిజర్వేషన్లు .. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకొచ్చామని ప్రభుత్వ ఘనతల్ని వివరించారు.
పలు చోట్ల గ్రామ, వార్డు సచివాలయాల్ని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అయితే.. నియామకాలు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. వివిధ విభాగాల వారికి ఇంకా నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది. వారికి ట్రైనింగ్ లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సి ఉంది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న ఆశావర్కర్లు లాంటి ఇతర ఉద్యోగులతో సమన్వయం చేయాల్సి ఉంది. దీని కోసం.. అధికారులు కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నారని.. అందుకే జనవరి ఒకటో తేదీ నుంచి గ్రామ సచివాలయాల సేవలు… అందించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.