‘వినయ విధేయ రామ’ ట్రైలర్ వచ్చేసింది. ఎప్పటిలానే బోయపాటి సినిమాల్లో కనిపించే బీభత్సమైన హీరోయిజం, కావల్సినంత రక్తపాతం, తెరలు చిరిగిపోయేంత డైనమిజం ఈ ట్రైలర్లో కనిపించాయి. మాస్ థియేటర్లో ఊగిపోవడానికి, చిరంజీవి అభిమానులు పండగ చేసుకోవడానికి కావల్సినంత సరంజామా మాత్రం ఈ ట్రైలర్లో ఉంది. కాకపోతే.. టైటిల్‌కీ, ట్రైలర్‌కీ పొంతనే కనిపించలేదు. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా సెటైరికల్‌గా ప్రస్తావించారు. ‘ఈ ట్రైలర్లో విధ్వంసరాముడే కనిపించాడు. వినయ విధేయ రాముడ్ని తెరపై చూపిస్తారేమో’ అంటూ తనదైన స్టైల్లో సెటైర్ వేశారు. ”నేను ఈ జోనర్స్లో సినిమాలు చూడను. కానీ బోయపాటి కోసం తప్పకుండా చూస్తా” అంటూ ముక్తాయించాడు కేటీఆర్.
కేటీఆర్ మాటల సందర్భంగా ‘రంగస్థలం’ ప్రస్తావన వచ్చింది. ఆ సినిమా గురించి చరణ్ చెప్పినప్పుడు అంతగా ఆసక్తి కనబరచలేదని, అర్బన్ సెన్సిబులిటీస్ ఉన్న చరణ్‌ని పల్లెటూరి పాత్రలో ఊహించుకోలేకపోయానని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు కేటీఆర్. అందుకే ‘చచ్చినా రంగస్థలం చూడను’ అన్నాడట. కానీ.. ఆ సినిమా బాగుందని చాలా మంది చెబితే…. అప్పుడు చూశాడట. ”రంగస్థలంలో చరణ్ బెస్ట్ పెర్‌ఫార్మ్సెన్స్ కనిపించింది. ఆ సినిమాలోని ఆగట్టునుంటావా నాగన్న.. ఈ గట్టుకొస్తావా` అనే పాటని మేం ఎన్నికల సమయంలో వాడుకున్నాం. దేవిశ్రీ అందుకు థ్యాంక్స్ కూడా చెప్పాడు. ‘థ్యాంక్సు సరే.. కానీ పాట వాడుకున్నందుకు డబ్బులు ఇవ్వను” అన్నాను.. అంటూ చమత్కరించాడు కేటీఆర్.