‘వినయ విధేయ రామ’…. రామ్ చరణ్ సినిమాకి బోయపాటి ఈ టైటిల్ ఫిక్స్ చేయడానికి జనం షాకయ్యారు. భద్ర, తులసి, దమ్ము, సింహా, లెజెండ్…. ఇలాంటి మాస్ టైటిళ్లతో హోరెత్తించిన బోయపాటి ఫ్యామిలీ డ్రామా టైపు కథని, టైటిల్‌ని ఎంచుకున్నారేంటి అని ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఫస్ట్ లుక్‌నీ, టీజర్నీ వదిలాడు బోయపాటి. అసలు టైటిల్‌కీ, టీజర్‌కీ సంబంధం లేకుండా… తనదైన యాక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయిన బోయపాటిని చూసి ఈసారి మరోసారి ముక్కున వేలేసుకున్నారు. బోయపాటి ఏం మారలేదని, టైటిల్లో ఉన్న సాఫ్ట్‌నెస్, తన టీజర్లో లేదని కామెంట్లు చేశారు.
అందుకనేనేమో.. ఇప్పుడు ఈ సినిమాకి ఫ్యామిలీ కోటింగు ఇవ్వడంలో బిజీ అయిపోయాడు బోయపాటి. దానికి తగ్గట్టుగానే సాఫ్ట్, కూల్ మూడ్‌లో ఉన్న పోస్టర్లు ఒకొక్కటిగా విడుదల చేస్తున్నాడు. మొన్ననే కొబ్బరి బొండాల స్టిల్ వదిలిన బోయపాటి.. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలసి హ్యాపీ మూడ్‌లో ఉన్న మరో స్టిల్‌ని బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు విడుదల చేస్తున్న తొలి పాట కూడా ఫ్యామిలీ సాంగే. దాంతో… మళ్లీ టైటిల్‌కి తగ్గ మూడ్ క్రియేట్ చేయాలని, ఇదో ఫ్యామిలీ సినిమా అనే ఆలోచన అందరికీ కలగాలన్నది తన విశ్వ ప్రయత్నం.
అయితే బోయపాటి ఇస్తున్న ఈ కోటింగులపై కూడా సోషల్ మీడియాలో బోలెడన్ని జోకులు పుట్టుకొస్తున్నాయి. కొబ్బరి బొండాల స్టిల్ చూసి… ”తాగండి తాగండి.. తదుపరి సీన్లో మీ అందరి నుంచీ ఓ లారీ వెళ్లిపోయి, రక్తపాతం సృష్టించే సీన్ ఒకటి.. బోయపాటి ప్లాన్ చేశాడు” అంటూ సెటైర్లు వేస్తున్నారు. బోయపాటి పంథానే అది. ఓ హ్యాపీ మూడ్‌లో ఉన్న ఫ్యామిలీని చూపించి, ఆ వెంటనే విలన్లని రంగంలోకి దింపి… రక్తపాతం సృష్టిస్తాడు. మరి అదే ఫార్ములా ఇందులోనూ ఉందేమో చూడాలి..