కరోనా పెద్ద దెబ్బే వేసింది. రెక్కాడితే గానీ డొక్కాడని పేదల కడుపులపై కొట్టింది. ఏప్రిల్ 14 వరకూ ఎవరికీ పని లేదు. తిండి గింజలు సంపాదించుకునే మార్గాలు మూసుకుపోయాయి. అలాంటి వాళ్లని ఆదుకోవాల్సిన బాధ్యత కొంతమంది పెద్దలు తీసుకుంటున్నారు. సినీ పరిశ్రమలోని కార్మికుల్ని ఆదుకోవడానికి ఒకొక్కరుగా ముందుకు వస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు వినాయక్ తన వంతు సాయంగా రూ.5 లక్షలు ప్రకటించాడు. ఈ సొమ్ముని కాదంబరి కిరణ్ చేతిలో పెట్టాడు. ఆ డబ్బుతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి అవసరమైన పేద సినీ కళాకారులకు అందజేయబోతున్నారు. ఇండ్లలో పనిచేసే సిబ్బందికీ, డ్రైవర్లకీ జీతాలు ముందుగానే చెల్లించి, కష్టకాలంలో ఆదుకోవాలని తోటి వారికి సూచించాడు వినాయక్. ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఈ పని చేసేశాడు.రాజశేఖర్ కూడా నిత్యావసర వస్తువుల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. నితిన్ 20 లక్షల్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాడు. మిగిలినవాళ్లూ ఇలానే ముందుకొచ్చి తమ సేవాతత్పరత చాటుకుంటే బాగుంటుంది.