ఓ అభిమాని కి తన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు. బాబి అలాంటి ఆనందమే పొందుతున్నాడు. చిరంజీవికి ఆయన వీర ఫ్యాన్. ఇప్పుడు స్వయంగా చిరుకే ‘యాక్షన్.. కట్’ చెబుతున్నాడు. చిరు – బాబి కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా మరో దర్శకుడు వి.వి.వినాయక్ కూడా సరదాగా సెట్‌కి వెళ్లారు. అక్కడ చిరు లుక్ నీ, ఆయన చేస్తున్న యాక్షన్ ఫీట్లనీ చూసి మురిసిపోయాడట. వినాయక్ కూడా చిరుకి వీరాభిమానినే. అందుకే.. తన హీరోని మాస్ లుక్ లో, అంత ఎనర్జిటిక్ గా చూపించినందుకు బాబిని అభినందించాడట. ”అన్నయ్యని ఇలా చూసి చాలా కాలమైంది.. అభిమానులకు గుర్తుండిపోయే సినిమా ఇవ్వు..” అని బాబి భుజం తట్టి వెళ్లారట.
చిరంజీవి కూడా ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈమధ్య చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ ఒక్కటే స్ట్రయిట్ తెలుగు సినిమా. ఈ సినిమా కథ బాగా నచ్చేయడంతో… టెక్నీషియన్లను మాట్లాడి, తనకు కావల్సిన టీమ్ ని రంగంలోకి దించారు. ఇందులో రవితేజ కూడా ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజతో మాట్లాడి, ఆ పాత్రకు ఒప్పించింది కూడా చిరునే. అలా అన్ని విషయాల్లోనూ ఈ సినిమాపై ఫోకస్ పెట్టారు.