ప్రేమ కథల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమా ‘ఆర్య’. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయ్యింది. అయినా ఇప్పుడు చూసినా ‘ఆర్య’ కొత్తగానే కనిపిస్తుంది. దానికి కారణం.. సుకుమార్ రైటింగ్, మేకింగ్. ఈ సినిమా కోసం చాలామంది కష్టపడ్డారు. తెర వెనుక చమటోడ్చారు. అయితే ఈ సినిమా వెనుక ఓ రహస్య హస్తం ఉంది. అదే.. వినాయక్.
‘దిల్’ చిత్రానికి వినాయక్ దగ్గర సుకుమార్ పని చేశాడు. అక్కడే దిల్ రాజుకు సుకుమార్‌కీ అనుబంధం ఏర్పడింది. సుకుమార్ స్పీడు చూసి ముచ్చట పడిన దిల్ రాజు ‘దిల్’ హిట్టయితే ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడు. అనుకొన్నట్టు ‘దిల్’ హిట్టయ్యింది. సుకుమార్‌కు ఛాన్స్ వచ్చింది. అయితే సుకుమార్ చెప్పిన కథ చాలా కాంప్లికేటెడ్ గా అనిపించింది. దిల్ రాజు ‘ఓకే’ అనడానికే చాలా టైమ్ పట్టింది. ఆ తరవాత బంతి… అల్లు అరవింద్ దగ్గర ఆగింది. బన్నీకి విపరీతంగా ఈ కథ నచ్చినా, ఎందుకో అల్లు అరవింద్ సాహసించడం లేదు. ‘కథైతే బాగానే చెప్పాడు కానీ దర్శకుడిగా అనుభవం లేదు కదా, సుకుమార్ తీయగలడా, లేదా’ అనే అనుమానం అల్లు అరవింద్ ని వెంటాడింది. ఈ సమయంలోనే వినాయక్ రంగంలోకి దిగాడు. ‘నన్ను నమ్మండి. సుకుమార్ బాగా తీయగలడు. మీకు అంతగా నమ్మకం లేకపోతే.. నేనొచ్చి సినిమా కంప్లీట్ చేస్తా’ అని మాట ఇచ్చాడు. దాంతో అల్లు అరవింద్ లో నమ్మకం ఏర్పడింది. ”వినాయక్ ఆ రోజు ఆ మాట చెప్పి, ధైర్యం ఇవ్వకపోతే, ఈ సినిమా ఉండేది కాదు..” అంటూ ‘ఆర్య’ 20 ఏళ్ల వేడుకలో పాత విషయాల్ని గుర్తు చేసుకొన్నాడు బన్నీ. ఈ సందర్భంగా బన్నీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ‘గంగోత్రి’ హిట్ అయినా తనకు పేరు రాలేదని, దానికి కారణం తనేనని, ఆ సినిమాని సరిగా ఉపయోగించుకోలేకపోయానని, అయితే ఆర్య వచ్చి మైనస్ 100లో ఉన్న తనని ప్లస్ 100గా మార్చిందని, ఒకేసారి 200 శాతం బూస్ట్ ఇచ్చిందని, మళ్లీ అలాంటి కిక్ ఎప్పటికీ రాదని, ‘ఆర్య’ సినిమాకు తన మనసులో ఉన్న స్థానం ఏమిటో మనసు విప్పి చెప్పాడు. తన జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేసిన ఒకే ఒక వ్యక్తి సుకుమార్ అనీ, తన బోగిని సరైన ట్రాక్‌లో పెట్టాడని, సుకుమార్‌ని జీవితాంతం గుర్తు పెట్టుకొంటానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు బన్నీ.