తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అపర కుబేరులు కూడా వచ్చి చేరారు. పేరున్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కుబేరులనదగ్గ వారందరూ… శ్రీవారి సేవ కోసం అంటూ… బోర్డులో సభ్యత్వం పొందారు. వీరు ఎలా… శ్రీవారి సేవ చేయబోతున్నారో తెలుసుకుంటే మాత్రం నోరెళ్లబెట్టక తప్పదు. వీరందరికీ… టీటీడీ సభ్యుల కోటాలో… దర్శన టిక్కెట్లు లభించబోతున్నాయి. వాటిని… అస్మదీయులకు పంచడం ద్వారా.. పలుకుబడి పెంచుకుని.. శ్రీవారి సేవ చేయబోతున్నారు. తొలి టీటీడీ బోర్డు మీటింగ్ లోనే..ఇప్పటి వరకూ ఉన్న టిక్కెట్ల కోటాకు అదనంగా మంజూరు చేసుకోబోతున్నారు. అంటే… వీఐపీ టిక్కెట్లు ఇక టీటీడీ బోర్డు సభ్యులకు మాత్రమే అందుతాయి. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా ఇక కష్టమేనంటున్నారు.
జెంబో పాలకమండలితో టీటీడీకి చాలా కష్టాలు ఎదురు కానున్నాయి. ఇప్పటి వరకూ టీటీడి చైర్మన్కు ప్రతీ రోజూ 200 నుంచి 300 బ్రేక్ దర్శన టిక్కెట్లు…. సభ్యులకు 35 వంతున టిక్కెట్లను జారీ చేస్తున్నారు. వీటికి అదనంగా చైర్మన్ కు 200, సభ్యులకు 35 చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లతో పాటు పదుల సంఖ్యలో ఆర్జిత సేవా టిక్కెట్లను జారీచేస్తున్నారు. గతంలో చైర్మన్ తో పాటు పాలకమండలి సంఖ్య 18. ఇప్పుడు 29. వీరికి ప్రస్తుతం వున్న కోటా ప్రకారం టిక్కెట్లు జారీ చేస్తే ప్రస్తుతం టీటీడి కేటాయిస్తున్న వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ల కోటాలొ సగం పైగా వీరికే ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్జిత సేవా టిక్కెట్లతో పాటు గదులు కేటాయింపు కూడా అధికారులకు తీవ్ర తలనొప్పిగా మారనుంది. దీనికి తోడు 23న జరగనున్న పాలకమండలి మొదటి సమావేశంలో టిక్కెట్ల కోటా పెంచుకోబోతున్నారు కొత్త పాలక మండలి సభ్యులు.
ఇప్పటి వరకూ పాలకమండలికి కేటాయిస్తున్న కోటా కంటే అదనంగా కోటా ఇవ్వాలంటూ సభ్యులు ప్రతిపాదించి దానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పవు. పాలకమండలి కాకుండా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సిఫారస్సుతో వచ్చే వారికి కూడా టిక్కెట్లు ఉండవు. టీటీడీ పాలకమండలి శ్రీవారితో పాటు భక్తులకూ భారంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది