పిల్లలను ఎత్తుకెళ్లేవారిగా అనుమానిస్తూ.. ఊరికి కొత్తగా వచ్చిన ఐదుగురు వ్యక్తుల్ని జనమంతా కలిసి… ప్రాణం పోయేదాకా కొట్టారు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది. వారపుసంత జరుగుతూండగా.. ఓ చిన్న పిల్లవాడితో మాట్లాడే ప్రయత్నం చేయడమే.. ఆ ఐదుగురు చేసిన తప్పు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చిన్న పిల్లల కిడ్నాపర్లు అంటూ.. జరుగుతున్న ప్రచారమే ఈ ఘటనకు మొత్తం కారణం. అక్కడి సంతలో ఎవరో… ఒకరో, ఇద్దరో సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని సీరియస్‌గా నమ్మేసే వాళ్లు ఉన్నారు. కొత్త వ్యక్తులు చిన్నారితో మాట్లాడటం వారు చూశారు. దాన్నే ఓ దావాలనంలా వ్యాపిపంచేశారు. ఫలితం.. ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.
గత నెల మొత్తం దేశంలో ఈ తరహా ఘటనలు ఏదో మూల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక మహిళపై దాడి చేసి.. ఆమె బిడ్డను బలవంతంగా ఎత్తుకెళ్తున్నారన్న ఓ వీడియో గత నెల మెదట్లో సర్క్యూలేట్ అయింది. దానికి అందరూ జాగ్రత్తగా ఉండాలన్న క్యాప్షన్‌ను జత చేశారు. ఫలితంగా… కొత్త వాళ్లు కనిపిస్తే.. దాడులు చేయడం కామన్‌గా మారిపోయింది. తమిళనాడులో రుక్మిణి అనే 65 ఏళ్ల మహిళను ప్రజలు ఇదే అనుమానంతో చితకబాది చంపేశారు. కర్నాటకలోని చామరాజ నగరలో కాలూరామ్ అనే రాజస్థానీ యువకుడిని ప్రజలు కొట్టి చంపేశారు. హైదరాబాద్ పాతబస్తీల్లో పిల్లల్ని అపహరించేందుకు వచ్చారంటూ.. హిజ్రాలను రక్తం చిందేలా కొట్టారు. చివరికి విశాఖపట్నంలోనూ ఇలాంటి ఘటన జరగింది. తెలుగు మాట్లాడటం రాని కారణంగా.. పిల్లలను ఎత్తుకెళ్లే వారికి భావించి కొంతమందిపై దాడి చేశారు. అందులో ఓ వ్యక్తి మరణించారు. తీరా చూస్తే అతనో ఉద్యోగి. తరచూ.. ఇలాంటి ఘటనలు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఏదో మూల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పడది తీవ్ర స్థాయికి చేరింది.
భారతదేశ మెజార్టీ ప్రజల మైండ్‌సెట్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా ఏదైనా చెప్పినా.. సోషల్ మీడియాలో చూసినా… ఠక్కున నమ్మేస్తారు. అందులో నిజం ఎంత ఉందని.. ఇసుమంత కూడా ఆలోచించరు. ఈ పరిస్థితి చదువుకోని వారిలోనే కాదు.. చదువుకున్నవారిలోనూ ఎక్కువగానే ఉంది. దానికి ఉదాహరణ కొన్ని రోజుల కిందట.. వచ్చిన ఉప్పుకొరత వదంతులు. అర్థరాత్రి అని కూడా చూడకుండా… షాపుల ముందు ఉన్న ఉప్పుబస్తాలను కూడా దోచుకెళ్లిపోయారు.. సామాన్యజనం. అసలు ఉప్పుకు కొరత రావడమేమిటన్న ప్రశ్న కూడా ఎవరూ వేసుకోలేదు. అలాగే.. పిల్లల కిడ్నాప్ ముఠాల వదంతులు. అంటే రాను రాను.. ఈ సోషల్ మీడియా.. సమాజానికి తీవ్రమైన హాని కలిగించేలా మారుతోందన్నది మాత్రం నిజం. కొత్త ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితికి కారణం ఎవరు..?