జగన్ పాదయాత్ర కి జనాల నుంచి స్పందన బాగా ఉందని క్యాడర్ అంతా హ్యాపీగా ఉంది. వైసిపి వర్గాలు కూడా ఈ పాద యాత్ర జగన్ ని అధికారానికి దగ్గర చేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఈ క్రమం లో జగన్ పాదయాత్ర లో జరిగిన ఒక చిన్న సంఘటన కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గత రెండు మూడ్రోజులుగా.
వివరాల్లోకి వెళ్తే, వేంపల్లె లో జగన్ పాదయాత్ర సందర్భంగా ఒక వృద్దురాలు వచ్చి తన కష్టాలు జగన్ కి చెప్పుకుంది. తనకి ఇల్లు లేదని, చూసుకోవడానికి ఎవరూ లేరని, తిండికి కూడా ఇబ్బందిగా ఉందనీ ఎంతో బాధపడుతూ చెప్పింది. విన్న వాళ్ళకి కూడా అయ్యో పాపం అనిపించేలా ఆమె మాట్లాడిన తర్వాత దీనిపై స్పందించిన జగన్- మరో ఏడాదిన్నర ఓపిక పడితే తన ప్రభుత్వం వస్తుందనీ, అప్పుడు ఇలాంటి కష్టాలు ఎవరికీ లేకుండా వృద్దాశ్రమాలు ప్రతి మండలం లోనూ నిర్మిస్తానని, అందులో నర్సులు, డాక్టర్లు సైతం అందుబాటులో ఉంటారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సమాధానానికి ఆ వృద్దురాలు కాస్త నిరాశపడ్డట్టు కనిపించింది.
అక్కడ ఉన్నవాళ్ళు, ఆ వృద్దురాలు బహుశా జగన్ ఏదైనా తక్షణ సహాయం (ఆ ముసలావిడకి ) చేస్తాడేమో అని భావిస్తే , జగన్ తాను ప్రభుత్వం లోకి వచ్చాక సాయం చేస్తానని, అప్పటిదాకా ఓపిక పట్టాలని చెప్పడం బహుశా ఆవిడకి నిరాశ కలిగించిందేమో మరి, ఆమె జగన్ ప్రసంగం ఇంకా కొనసాగుతుండగానే అక్కడి నుంచి నిష్క్రమించింది. ఇంతలో జగన్ ప్రక్కనే ఉన్న వైసిపి లీడర్, ఎంపీ అవినాష్ జగన్ చెవిలో ఏదో చెప్పారు. దాంతో జగన్ – ఆ వెళ్ళిపోతున్న ఆమె ని ఉద్దేశ్యించి, “అవ్వా, అవ్వా ఆగు, నీకు మరీ ఇబ్బంది గా ఉంటే కడప లో మనవాళ్ళదే ఒక వృద్దాశ్రమం ఉంది, నీకు ఇష్టమైతే అక్కడ నిన్ను చేర్పిస్తా” అని అన్నాడు. అయితే దీనికి ఆ ముసలావిడ స్పందించకుండా సభాస్థలి నుంచి వెళ్ళిపోయింది.
ఏదేమైనా, అన్ని సార్లూ, తాను ముఖ్యమంత్రి అయ్యే దాకా ఓపిక పట్టమని చెప్పడం కాకుండా ఇలాంటి సందర్భాలలో తన వైపు నుంచి కానీ, తన పార్టీ వైపు నుంచి కానీ, లేదా తమ పార్టీ స్థానిక నాయకులనుంచి కానీ ఎంతో కొంత తక్షణ సాయం చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.