సరైన మోతాదులో నిద్ర శరీరానికి చాలా అవసరం. నిద్ర మనిషికి కి డిప్రెషన్ రాకుండా చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తున్నాయి. ఒక చిన్న ” పవర్ నాప్” ఒత్తిడిని దూరం చేస్తుంది. సామాన్యుల తో పోలిస్తే మరింత బిజీ గా, మరింత ఒత్తిడిని ఎదుర్కొంటూ ప్రజా క్షేమం కోసం అను క్షణం తపించే రాజకీయ నాయకులకి నిద్ర మరింత అవసరం.
బహుశా ఈ జీవిత సత్యాన్ని బాగా ఆకళింపు చేసుకున్నారేమో నిన్న అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి , ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ఆవలిస్తూ, నిద్ర అపుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆ తర్వాత ఆపుకోలేక నిద్రపోతూ కెమెరా కంటికి చిక్కారు. బహుశా బడ్జెట్ ప్రసంగం చేస్తున్న బుగ్గన రాజశేఖర్ రెడ్డి పక్కనే కూర్చోవడం వల్ల, బుగ్గన ని ఫోకస్ చేస్తున్న కెమెరా కళ్ళలో ఈయన కూడా పడ్డారు కానీ, కాస్త దూరంగా వేరే వరుసలో కూర్చుని ఉంటే ఈ విధంగా దొరికిపోయి ఉండేవారు కాదు. ఏది ఏమైనా బడ్జెట్ ప్రసంగం జరుగుతున్న సమయంలో ఈయన నిద్ర పోతున్న దృశ్యం కెమెరా కంటికి చిక్కి, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది నెటిజన్లు, అంతేసి ప్రజాధనాన్ని, అన్నేసి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ అసెంబ్లీ నిర్వహిస్తుండగా ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే గురక పెట్టి నిద్ర పోవడం ఏమిటని చాందసంగా చిర్రుబుర్రులాడుతూ ఉన్నారు కానీ, నిద్ర మహత్యాన్ని , దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలని ఎమ్మెల్యే గారు అసెంబ్లీ వేదికగా ప్రజలకు ఇలా నేరుగా వివరించారని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
అయితే ఇలా ఒక ఎమ్మెల్యే నిద్రపోతుండగా సభాధ్యక్షులు వారు ఏం చేస్తున్నారని కొంతమందికి ప్రశ్న రావచ్చు కానీ, సభాధ్యక్షుల వారికి కూడా నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలు బాగానే తెలుసు అని వారు మర్చిపోతున్నారు. సభ అధ్యక్షులు అయిన స్పీకర్ సైతం అసెంబ్లీలో కునుకు తీస్తూ కెమెరా కళ్ళకు చిక్కి పోయి ప్రజలకు నిదురోపదేశం చేశారు.
ఏది ఏమైనా ప్రజలు కూడా ప్రజా ప్రతినిధుల నుండి ఇలాంటి కొన్ని మెళకువలు నేర్చుకుని వారి ఆరోగ్యాలను కాపాడుకో గలరని సోషల్ మీడియాలో మరికొంతమంది పిలుపునిస్తున్నారు.