టీ 20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు కింగ్ కోహ్లీ షాక్ ఇచ్చాడు. టీ 20లకు గుడ్ బై చెబుతూ కీలక ప్రకటన చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం టీ 20లకు వీడ్కోలు చెప్పేశాడు కోహ్లీ. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ బ్యాటింగ్ ఏమాత్రం ప్రభావవంతంగా లేదు. ఐపీఎల్ లోని సూపర్ ఫామ్ ని వరల్డ్ కప్ లో కొనసాగించలేకపోయాడు. అయితే ఫైనల్లో మాత్రం కీలకమైన ఇన్నింగ్స్ (59 బంతుల్లో 76) అడాడు. తొలి మూడు వికెట్లూ త్వరగానే కోల్పోయిన సమయంలో చివరి వరకూ ఉంటూ భారీ స్కోరు సాధించడానికి దోహదం చేశాడు. మ్యాన్ ఆఫ్ ది ఫైనన్ అవార్డును అందుకొన్నాడు. టీ 20 విజేతగా నిలిచిన ఈ అపురూపమైన క్షణంలో వీడ్కోలు గీతం పలికేశాడు. ఇంతకంటే ఓ ఆటగాడి వీడ్కోలుకు అనువైన సమయం ఏముంటుంది?
వన్డే, టెస్ట్ క్రికెట్లలో మేటి బ్యాటర్ గా మన్ననలు పొందిన కోహ్లీ… టీ 20 క్రికెట్ లోనూ తన ప్రభావం చూపించాడు. 125 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 4186 పరుగులు చేశాడు. ఇందులో 39 అర్థ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. 252 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 8 వేల పరుగులు సాధించాడు. టీ 20 అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా, వన్డే, టెస్ట్ మ్యాచ్లకు విరాట్ అందుబాటులోనే ఉంటాడు. ఐపీఎల్ లోనూ తను కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.